● స్థానికంగా ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి
● ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
నిజామాబాద్ అర్బన్: స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌హాల్‌లో మంగళవారం ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు ఎస్.సుధీర్‌రెడ్డితో కలిసి చైర్మన్ రాజయ్య సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఉత్తర తెలంగాణా జిల్లాల నుంచి వచ్చిన అదనపు కలెక్టర్లు తమ జిల్లాల్లో స్థానిక సంస్థల పనితీరును వివరించారు. ప్రజాప్రతినిధులు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, స్థానిక సంస్థల బలోపేతంపై దృష్టి సారించాలని రాజయ్య సూచించారు. స్థానిక సంస్థల్లో ఆదాయ వనరులను పెంపొందించుకునే అవకాశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సలహాలు స్వీకరించారు. ప్రభుత్వానికి నివేదిస్తామని అందిస్తామని తెలిపారు. నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


