నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 2న నియోజకవర్గ స్థాయి సమావేశాలను అట్టహాసంగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అన్నివర్గాల ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, నీట్ ప్రవేశ పరీక్ష, ధాన్యం సేకరణ, డివిజనల్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమావేశమయ్యారు. శనివారం నాటి నియోజకవర్గస్థాయి సభల విజయవంతంగా నిర్వహించాలన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం వేళలోనే సభలు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా కొనసాగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలు, రవాణా, గోనె సంచుల సరఫరా, హార్వెస్టర్ యంత్రాల వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవోల నేతత్వంలో ప్రతి సోమవారం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 3న జరగనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు జరగనున్న స్వీయ గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నమోదు చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి


