రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన అక్కపల్లి గంగాధర్(54) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. గురువారం రాత్రి గంగాధర్ కాలకృత్యాల కోసం పెద్ద చెరువు వద్దకు వెళ్లగా కాలుజారి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుని భార్య శోభ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
వర్ని: ఇటీవల కొడుకు దాడి చేయడంతో గాయపడిన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.రుద్రూర్ సీఐ కృష్ణ తెలిపిన వివరాలు ఇలా..మోస్రా మండలం చింతకుంట గ్రామానికి చెందిన కర్మంగళి శ్రీనివాస్ (51) తరచూ మద్యం సేవించి భార్య, కొడుకుతో ఘర్షణ పడేవాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం భార్య, కొడుకుతో అతడు గొడవ పడ గా కొడుకు బండరాయితో తండ్రి తలపై కొట్టాడు. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం ఉ దయం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలం తుంకిపల్లి గ్రామ శ్మశానం నుంచి దహనం చేసిన మృతదేహం పుర్రె, ఎముకలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన సిర్నపల్లి పోచవ్వ (70) గత నెల 28న అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో కుటుంబీకులు గ్రామశివారులో దహన సంస్కారాలు చేశారు. అయితే, రెండు రోజులకే మృతదేహానికి సంబంధించిన పుర్రె, ఎముకలు, ఇతర భాగాలు అపహరణకు గురయ్యాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు.
వృద్ధురాలు అదృశ్యం
భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామంలో మెదక్ జిల్లా బచ్చురాజుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు అదృశ్యమైనట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. బచ్చురాజు పల్లి గ్రామానికి చెందిన తొత్తల సుశీల(85) కాచాపూర్ గ్రామంలో ఉంటున్న సోదరి పద్మ ఇంటికి నెల రోజుల క్రితం వచ్చింది. ఏప్రిల్ 29న పద్మ తన అక్క సుశీలను కాచాపూర్ వద్ద కామారెడ్డి వెళ్లే బస్సు ఎక్కించింది. అప్పటి నుంచి సుశీల ఆచూకీ లేదు. సుశీల కొడుకు తొత్తల మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


