హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి
నిజామాబాద్‌అర్బన్: దేశ సరిహద్దులో సైన్యంతోపాటు అంతర్భాగంలో పోలీసులు, ఇతర విపత్తు నిర్వహణ సంస్థలతో కలిసి హోంగార్డులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని సీపీ సాయిచైతన్య అన్నారు. హోంగార్డులు అంటే కేవలం ఒక విభాగం కాదని, అది సమాజ సేవకు, శాంతి భద్రతలకు దృఢమైన మద్దతని వివరించారు. శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ల్లో హోంగార్డుల 63వ రైసింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతలు, ప్రకృతి విపత్తులు, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో హోంగార్డుల పాత్ర అసాధారణమైందన్నారు. ఎన్నికల బందోబస్తు, పండుగల నిర్వహణ, కోవిడ్–19 పరిస్థితులలో కృషి అమోఘమన్నారు. హోంగార్డ్స్ మెడికల్ గ్రాంట్ కింద రూ.పది వేల చొప్పున ఆరుగురికి మంజూరైనట్లు పేర్కొన్నారు. ఇటీవల అత్యుత్తమ సేవలు అందించిన 20 మంది హోంగార్డులకు ప్రశంస పత్రాలు అందజేశారు. వెల్‌నెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్, శేఖర్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


