9న గిరిరాజ్ కాలేజీలో జాబ్‌మేళా
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీలో ఈ నెల 9న రిలయన్స్, జియోలో ఉద్యోగాలకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా టాస్క్ మేనేజర్ రఘు తేజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో రిలయన్స్, జియో ద్వారా రిక్రూట్‌మెంట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. పాయింట్ మేనేజర్ పోస్టుకు రూ.3.36 లక్షల వార్షిక వేతనం, అసిస్టెంట్ పాయింట్ మేనేజర్ పోస్టుకు రూ.2.10 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నందిపేట్, నవీపేట్, వేల్పూర్, బాల్కొండ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని, పురుషులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు అర్హులని, స్థానికులకే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
పోలీసుల తనిఖీలు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో శనివారం రాత్రి నిషేధిత మాదకద్రవ్యాలపై ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పాతబస్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగులు, హోటళ్లు, పాన్‌షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్ ద్వారా తనిఖీలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


