సర్దార్ పటేల్ మహోన్నత వ్యక్తి
నిజామాబాద్‌అర్బన్: జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘రన్ ఫర్ యూనిటీ– (2కె రన్)’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్వాతంత్య్ర పోరాటంలో దేశ సమగ్రత కోసం, దేశంలో అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. సీపీ మాట్లాడుతూ ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి భావంపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని కొనియాడారు. అనంతరం రన్‌లో ప్రతిభచాటిన సాయికిరణ్, నాగేందర్, రాజేశ్, ధరణి, గోదావరి, నికిత తదితరులకు కలెక్టర్, పోలీస్ కమిషనర్లు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి, శ్రీరామ్ చందర్‌రావు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


