యూడైస్‌లో వివరాలు నమోదు చేయాలి
● వీసీలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా
నిజామాబాద్ అర్బన్: పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థుల వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ రాష్ట్ర కార్యదర్శి యోగితారాణా సూచించారు. పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యాశాఖల పురోగతిపై శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. యోగితారాణా మాట్లాడుతూ ముఖగుర్తింపు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్) ద్వారా విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, సిబ్బంది హాజరు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సమగ్రశిక్షా పథకం కింద మంజూరైన నిధులను పరిశుభ్రత, చిన్నచిన్న మరమ్మతులు, మరుగుదొడ్లు, వంటగది షెడ్లు వంటి అవసరాలకు వినియోగించాలన్నారు. మౌలిక వసతులతోపాటు నిరంతరం ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా కలిగి ఉండాలని సూచించారు. ఫిజిక్స్‌వాలా, ఖాన్ అకాడమీ వంటి ఆన్‌న్‌లైన్ కోచింగ్ వనరులను జేఈఈ, సీఎల్‌ఏటీ, నీట్ వంటి పరీక్షల కోసం పరిశీలించాలన్నారు. పీఎం పోషణ పథకం కింద వంటగది షెడ్లు, ప్రహరీలు నిర్మించాలని, విద్యార్థుల ఆధార్, అపార్ నమోదు సమయానుసారం పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రత, ఆహార ప్రమాణాలు నిరంతరం పరిశీలించాలని సూచించారు. పదో తరగతి ఫలితాలు మెరుగుపడేలా సమగ్ర ప్రణాళికతో కృషి చేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరిశుభ్రత, నిర్వహణ పనులను పర్యవేక్షించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.


