795 ఎకరాల పంట నష్టం
● ప్రాథమిక అంచనా వేసిన వ్యవసాయ శాఖ
డొంకేశ్వర్(ఆర్మూర్): రెండ్రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి జిల్లాలో 795 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. చాలా మండలాల్లో పొలాల్లోనే వరిపైరు నేలకొరిగి నీట మునగగా, 33 శాతానికి మించి జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయాధికారులు పరిగణలోకి తీసుకున్నారు. అత్యధికంగా కమ్మర్‌పల్లిలో 595, జక్రాన్‌పల్లిలో 200 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. డిచ్‌పల్లి, డొంకేశ్వర్, నందిపేట్, ఆలూర్ మండలాల్లో కూడా పంట నష్టం జరిగినా 33 శాతానికి తక్కువగా ఉండడంతో వాటిని లెక్కలోకి తీసుకోలేదు. పంటనష్టం వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించినట్లు జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ తెలిపారు. కాగా, శుక్రవారం ఎండ వాతావరణం ఏర్పడడంతో తడిసిన ధాన్యాన్ని కల్లాలు, రోడ్లపై ఆరబోసేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు.
డిచ్‌పల్లి మండలం ధర్మారంలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూపుతున్న రైతు


