పటేల్ జీవితం యువతకు ఆదర్శం
తెయూ వీసీ యాదగిరిరావు
తెయూ(డిచ్‌పల్లి): ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశానికి పునాదులు వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత జాతి ఐక్యతకు గుర్తుగా నిలిచిపోతారని, ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని తెయూ వీసీ టి.యాదగిరిరావు అన్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు శుక్రవారం తెయూ ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త అపర్ణ ఆధ్వర్యంలో సర్దార్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా నిర్వహించారు.
కంప్యూటర్ సైన్స్ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లతో ఐక్యత పరుగును నిర్వహించారు. అనంతరం వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. భారతదేశంలోని 562 సంస్థానాలను ఏకీకృతం చేయడంలో ఆయన చూపిన ధైర్యం చాతుర్యము, ధృడనిశ్చయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, అధ్యాపకులు, సిబ్బంది ఐక్యత ప్రమాణం చేశారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ ఆరతి, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు స్రవంతి, స్వప్న, అలీం ఖాన్, సంపత్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
దేశ సమగ్రతలో కీలకపాత్ర
డిచ్‌పల్లి: భారతదేశ సమగ్రతలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కీలక ప్రాత పోషించారని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్, డిచ్‌పల్లి అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు అన్నారు. సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకొని బెటాలియన్‌లో ఏక్తాదివస్ కార్యక్రమం నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసులతో కలిసి ఐక్యత ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ కేపీశరత్‌కుమార్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పటేల్ జీవితం యువతకు ఆదర్శం


