
క్రైం కార్నర్
డ్రెయినేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ఖలీల్‌వాడి: నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద గల డ్రెయినేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపారు. మురికి కాలువలో మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, అడి వయస్సు సుమా రు 40ఏళ్లు ఉంటాయని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు.
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖలీల్‌వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని నెహ్రూనగర్ బస్టాండ్ దగ్గర నెల రోజుల క్రితం ఒక గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్య సమస్యలతో అపస్మారక స్థితి లో పడిఉన్నాడు. అతడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అతడిని చికిత్స నిమి త్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు యాబై ఏళ్లు ఉంటాయని, ఎవరైనా అతడిని గుర్తిస్తే పోలీస్ స్టేషన్‌లో గాని, లేదా 8712659848, 8712659734కు సంప్రదించాలన్నారు.
చోరీకి గురైన బైక్ రికవరీ
సదాశివనగర్(ఎల్లారెడ్డి): చోరీకి గురైన బైక్‌ను నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా.. మండలంలోని పద్మాజివాడి చౌరస్తా వద్ద పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి అనుమానాస్పదంగా బైక్‌పై వెళుతుండగా పోలీసులు అతడిని ఆపారు. వివరాలు సేకరించగా బైక్‌ను చోరీ చేసి తీసుకువస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు. వెంటనే పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకొని, వాహన యజమానికి సమాచారం అందించారు. పట్టుబడ్డ నిందితుడిని కామారెడ్డి పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.