
వృద్ధురాలి ఆత్మహత్య
సిరికొండ: మండలంలోని చీమన్‌పల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన చందాల లక్ష్మీ(63) అనే వృద్ధురాలు గత కొన్ని రోజుల నుంచి మానసిక స్థితి సరిగా ఉండటం లేదు. ఒంటరిగా నివసించడంతో తీవ్ర మనోవేదనకులోనై తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
హాస్టల్ వార్డెన్..
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహం వార్డెన్ షబానా ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన షబానా గత సంవత్సరం ఆగస్టులో ఆర్మూర్‌లోని ఎస్సీ హాస్టల్‌లో విధుల్లో చేరింది. ఆర్మూర్ పట్టణంలోనే ఉంటూ విధులు నిర్వహిస్తుండేది. కాగ రెండు రోజులు సెలవులు రావడంతో ఆమె జగిత్యాలలోని ఆమె ఇంటికి వెళ్లింది. ఆమె స్వగృహంలో శనివారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది.ఈ ఘటనపై తోటి ఉద్యోగులు, హాస్టల్ విద్యార్థినులు విచారం వ్యక్తం చేశారు.