
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఖలీల్‌వాడి: వినాయక చవితి వేడుకల్లో ఎవరైన ని బంధనలు అతిక్రమిస్తే ఎంతటివారైన చర్యలు తప్పవని సీపీ పోతరాజు సాయి చైతన్య హెచ్చరించారు. నగరంలోని సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయా పోలీస్‌స్టేషన్ ఎస్సైలకు తగిన ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామన్నారు. గణేష్‌మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విగ్రహాలను వివాదాస్పద స్థలాల్లో పెట్టవద్దని, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్దకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన పార్కింగ్ స్థలం కూడ ఎంపిక చేసుకోవాలన్నారు. పోలీసుల అను మతి లేనిదే మండపం పెట్టవద్దన్నారు. రాత్రి 10 తర్వాత డీజే సౌండ్స్ నిషేదం అన్నారు. మండపాలకు విద్యుత్ కనెక్షన్ కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రాజావెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.