
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఖలీల్‌వాడి: నగర పరిధిలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు తెలిపారు. చెరువులో గురువారం ఉదయం మృతదేహం పైకి తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటాయని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు ఆరో టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
పార్థి దొంగల ముఠా సభ్యుడి అరెస్టు
కామారెడ్డి క్రైం: జాతీయ రహదారుల వెంబడి ఆగి ఉన్న వాహనాలను టార్గెట్ చేస్తూ దారి దోపిడీలకు పాల్పడడంతోపాటు ఆయా జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పార్థి దొంగల ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముధ్కేడ్ ప్రాంతానికి చెందిన ముఠాలోని ముగ్గురిని కొంతకాలం క్రితం కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో జాతీయ రహదారులపై జరుగుతున్న దారి దోపిడీలు, రోడ్డుకు సమీపంలోని ఇళ్లలో దొంగతనాలకు సంబంధించిన కేసులు ఈ ముఠాపై నమోదై ఉన్నాయి. జిల్లాలోని గాంధారి, పిట్లం, బీర్కూర్, సదాశివనగర్, మద్నూర్, తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లలో పార్థి ముఠాపై కేసులున్నాయి. పోలీసులు ముగ్గురు సభ్యులతోపాటు ఓ రిసీవర్‌ను అరెస్టు చేసిన్పటికీ.. ప్రధాన సభ్యుడు భాస్కర్ బాపూరావు చౌహాన్ ఎనిమిది నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం చాలా రోజులుగా గాలిస్తున్నాయి. అతడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు శ్రీనివాస్, సంతోష్‌కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, రంజిత్, ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది గణపతి, శ్రీనివాస్, రాజేందర్, శ్రావణ్, లక్ష్మీకాంత్, స్వామి, మైసయ్య, రవిని ఎస్పీ అభినందించారు.