
అంతర పంటలు.. ఆదాయ వనరులు
ఆర్మూర్: జిల్లాలో సంప్రదాయ వ్యవసాయానికి పెద్ద పీట వేసే రైతులు ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు వేస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురువడంతో పాటు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు గ్రామాల్లోని చెరువుల్లోకి చేరుతుండటంతో రైతులు ఈ ఏడు తమ పంటలు పండినట్లేనని ఆనందంగా ఉన్నారు. ప్రధాన పంటలతో పాటు చిన్న చిన్న ఖర్చులు వెల్లదీసుకోవడానికి ప్రతీ రైతు అంతర పంటలను విత్తుకుంటున్నారు.
జిల్లాలో వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం సుమారు 32 వేల ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారు. పసుపును జూన్ మొదటి వారం నుంచి విత్తుకుంటు ఉంటారు. తొమ్మిది మాసాల పంట అయిన పసుపు జనవరి, ఫిబ్రవరి నెలలో రైతుల చేతికి అందుతుంది. అయితే పసుపు మొలక దశలో నీడ అవసరం ఉంటుంది. లేకుంటే పసుపు మొలక ఎండలకు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు పసుపు పండించే మళ్లలో అంతర పంటగా పసుపుతో పాటు మొక్కజొన్నను విత్తుకుంటారు. పల్చగా విత్తుకున్న మొక్కజొన్న పసుపు మొలకకు నీడగా ఉండటమే కాకుండా రైతులకు అదనపు ఆదాయాన్ని ఆర్జించి పెడుతుంది. ఒకే మడిలో ఏకకాలంలో రెండు పంటలు విత్తుకొనే అవకాశం ఏర్పడుతుంది. మరో వైపు ఆయిల్ పామ్ మొక్కల మధ్య పసుపు పంటను విత్తుకుంటుంటారు. పసుపు విత్తుకున్న మళ్ల ఒడ్లపై కందులు (తొగర్లు), చిక్కుడు, దోసకాయలు, బంతి పూలను సైతం రైతులు విత్తుకుంటారు. ఈ పంటలు రైతులకు చిన్న చిన్న ఖర్చులు వెల్లదీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. పసుపు సాగుకు ఉపయోగించే నీటితోనే అదనంగా మొక్కజొన్న, చిక్కుడు, కందులు, దోసకాయ, బంతిపూల లాంటి పంటలు ఎలాంటి శ్రమ లేకుండా పెరిగిపోయి పంట చేతికి వస్తుంది. దీంతో పసుపు పంటకు పెట్టుబడి వ్యయం అధికంగా అవుతున్న రైతులకు ఆర్థిక భారం కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది.
ఆయిల్ పామ్ చెట్ల మధ్య పసుపు
పంటతో అదనపు ఆదాయం
పసుపులో అంతర పంటగా
మొక్కజొన్న విత్తుకుంటున్న రైతులు

అంతర పంటలు.. ఆదాయ వనరులు

అంతర పంటలు.. ఆదాయ వనరులు