
పింఛన్ ఇప్పించాలని వినతి
డిచ్‌పల్లి: ప్రతి నెలా పింఛన్ పంపిణీ ప్రారంభం కాగానే ముందుగా తమకు అందించేలా చూడాలని డిచ్‌పల్లి మండలం దేవునగర్ క్యాంప్, దేవుపల్లి క్యాంప్ గ్రామస్తులు సోమవారం ఎంపీడీవో రాజ్‌వీర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ గ్రామస్తుల్లో ఎక్కువ మంది గతంలో కుష్టు వ్యాధికి గురవడం వలన వేలి ముద్రలు నమోదు కావని ఎంపీడీవోకు వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చేయూత పెన్షన్ ఫేస్ రికగ్నయిజ్ యాప్ లో సైతం తాము సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దేవునగర్ క్యాంప్ కు ప్రత్యేకంగా ఒక బీపీఎంను కేటాయించాలన్నారు. పై అధికారులతో మాట్లాడి తమ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ ఖతిజా యూసుఫ్ కోరారు. స్పందించిన ఎంపీడీవో వెంటనే డీఆర్‌డీవోతో పాటు, డిచ్‌పల్లి ఎస్పీఎం తో మాట్లాడి సమస్యను వివరించారు. వచ్చే నెల నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభం కాగానే ముందుగా దేవునగర్ క్యాంప్ వారికి ఇవ్వాలని తపాలా శాఖ వారికి, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.