
వేర్వేరు చోట్ల జీవాలపై చిరుతల దాడి
● మహంతంలో దూడ, గడ్కోల్‌లో మేక మృతి
నవీపేట/సిరికొండ: జిల్లాలోని నవీపేట, సిరికొండ మండలాల్లో చిరుతలు జీవాలపై దాడి చేసి చంపేశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట మండలం మహంతం గ్రామానికి చెందిన మేకల లక్ష్మన్‌కు నాలుగు గేదెలు, రెండు దూడలు ఉన్నాయి. మేత మేశాక ఎప్పటిలాగే గుట్ట కింద భాగంలోని రేకుల షెడ్డులో వీటిని కట్టేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం వచ్చి చూసేసరికి అందులోని దూడ చనిపోయి ఉంది. చిరుత దాడిగా అనుమానించి బాధితుడు ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలాన్ని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు జెహూర్, కుద్బుద్దీన్, బీట్ ఆఫీసర్ సుధీర్ పరిశీలించారు. మహంతం గుట్ట నుంచి వచ్చిన చిరుత దూడపై దాడి చేసినట్లుగా నిర్ధారించారు. వెటర్నరీ వైద్యుడు నరేందర్‌రెడ్డి పోస్టుమార్టం నిర్వహించారు.
గడ్కోల్‌లో..
సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన మనోజ్ శనివారం తన మేకల మందను బొగ్గులకుంట అటవీ ప్రాంతంలోకి మేతకు తీసుకెళ్లాడు. పొదల్లో నుంచి వచ్చిన చిరుత, మేక మెడ భాగంలో దాడి చేసింది. అరుపులు విన్న కాపరులు గట్టిగా కేకలు వేయడంతో మేకను వదిలేసి చిరుత అడవిలోకి వెళ్లిపోయిందని తెలిపారు. గడ్కోల్ బీట్ ఆఫీసర్ దిలీప్ మేకను పరిశీలించారు. ఘటన స్థలంలో మొత్తం గడ్డి ఉండటంతో చిరుత అడుగులు కనబడలేనది ఆయన పేర్కొన్నారు.

వేర్వేరు చోట్ల జీవాలపై చిరుతల దాడి