
పెద్దాసుపత్రికి సుస్తీ
● సమస్యల వలయంలో జీజీహెచ్
● పని చేయని ఫ్యాన్లు
● ఇబ్బంది పడుతున్న రోగులు
● కనిపించని హెల్ప్‌డెస్క్,
ఆరోగ్యమిత్ర సిబ్బంది
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. పేరుకు పెద్దాసుపత్రి అయి నా కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా జీజీహెచ్‌లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సమాచారం అందించాల్సిన హెల్ప్‌డెస్క్, ఆరోగ్యమిత్ర కౌంటర్లు సిబ్బంది లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నడవలేని స్థితిలో ఉండే రోగులను తీసుకెళ్లేందుకూ సిబ్బంది లేకపోవడంతో బంధువులే స్ట్రెచర్లపై తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిత్యం 1,800 నుంచి 1,900 వరకు ఓపీ నమోదవుతోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందించాల్సి ఉంటుంది. జిల్లా నుంచే కాకుండా నిర్మల్, కామారెడ్డి, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా వైద్య సేవల కోసం పేద లు జీజీహెచ్‌కు వస్తుంటారు. రోగాలతో బాధపడు తూ దవాఖానాకు వచ్చేవారు డాక్టర్ వద్దకు వెళ్లాలంటే కచ్చితంగా ఓపీ చీటీ ఉండాల్సిందే. ఓపీ చీటీ కోసం ఆరు కౌంటర్లు ఉన్నాయి. ఇందులో ఓ కౌంటర్ ఎప్పటికీ మూసి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచే ఓపీ చీటీ కోసం రోగులు, వారి బంధువులు క్యూలో నిలబడాల్సి వస్తుంది. క్యూ లైన్‌లపై పేరుకే 8 ఫ్యాన్లు ఉన్నా ఒక్కటీ పనిచేయదు. రోగాలు నయం చేసుకునేందుకు వస్తే క్యూలైన్‌లో నిలబడి అవస్థలు పడాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూర్చోవడానికి సైతం సరిపడా కుర్చీలు లేవని వాపోతున్నారు.
● జీజీహెచ్‌కు వచ్చే రోగుల సహాయం కోసం హెల్ప్‌డెస్క్, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ మిత్ర టేబుల్స్ ఉన్నా లేనట్టే. పేరుకు టేబుల్స్ ఉన్నా సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. నిత్యం కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
● అనారోగ్యంతో నడవలేని రోగులు, కాళ్లు, చేతులు విరిగిన క్షతగాత్రులను వీల్‌చైర్, స్ట్రెచర్‌లపై బంధువులే వైద్యుల వద్దకు తీసుకెళ్తున్నారు. సిబ్బంది ఉన్నా పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.

పెద్దాసుపత్రికి సుస్తీ