
ఉపాధి ఉద్యోగులకు వేతనాల తిప్పలు
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నాలుగు నెలలు, ఇతర ఉద్యోగులకు మూడు నెలల నుంచి వేతనాలు జమ కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు కోసం ఇచ్చే నిధుల నుంచే రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు మంజూరైనా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పేదరిక నిర్మూలన సంస్థ, ఉపాధి హామీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండు విభాగాల ఉద్యోగులు కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను పర్యవేక్షిస్తున్నారు. పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు క్రమం తప్పకుండా వేతనాలను చెల్లిస్తున్నారు. ఉపాధి చూపే ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. ఉద్యోగుల వేతన చెల్లింపులపై ‘సాక్షి’ ఉన్నతాధికారులను వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉందని వెల్లడించారు. ఉద్యోగులు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా త్వరలో వేతనాలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
జిల్లాలో ఉపాధి ఉద్యోగులు
నెలల తరబడి నిలిచిన జీతాలు
ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు
ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు