
చట్టాలపై అవగాహన అవసరం
నందిపేట్ (ఆర్మూర్): ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి భాస్కరరావు అన్నారు. నందిపేట మండలం శాపూర్ గ్రామంలో గురువారం జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ కార్యదర్శి, జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి భాస్కర్ రావుతోపాటు మరో నలుగురు సీనియర్ న్యాయవాదులు హాజరై, అంశాలపై అవగాహన కల్పించారు. కొన్ని గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీ(వీడీసీ)లు చట్టాన్ని చేతిలోకి తీసుకొని సమాంతర ప్రభుత్వం నడుపుతున్నట్లు తెలిసిందన్నారు. వీడీసీలు అభివృద్ధి పనులు చేపట్టాలి కానీ చట్ట వ్యతిరేక పనులు చేయరాదని సూచించారు. గ్రామ అభివృద్ధిలో యువత ముఖ్య భూమిక పోషించాలన్నారు. ప్రజల హక్కులను కాపాడడానికే పోలీస్, న్యాయ వ్యవస్థలు పనిచేస్తాయని తెలిపారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, జీపీ కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు.