
ఇన్‌చార్జులతో ఇంకెన్నాళ్లు?
సుభాష్‌నగర్: ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖకు కీలకమైన నిజామాబాద్ అర్బన్ కార్యాలయం ఇన్‌చార్జుల పాలనలో కొనసాగుతోంది. ఏడాదిగా ఇక్కడ సీనియర్ అసిస్టెంట్లే సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తే ఇలా వచ్చి.. అలా సెలవుపై వెళ్తున్నారు. ఏసీబీ దాడులు, డాక్యుమెంట్ రైటర్ల బెదిరింపుల కారణంగానే ఇక్కడికి సబ్ రిజిస్ట్రార్‌గా వచ్చేందుకు అధికారులు భయపడుతున్నట్లు తెలిసింది.
కొరవడిన పర్యవేక్షణ..
జిల్లా రిజిస్ట్రార్ (డీఆర్) కార్యాలయ ఆవరణలోనే ఈ కార్యాలయం ఉంటుంది. అయినా అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు, సిబ్బంది వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మంగళవారం మధ్యాహ్నం 12 గంటలైనా సబ్ రిజిస్ట్రార్లు కార్యాలయానికి రాలేదంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయంటేనే పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు ఉన్న ఒక్క ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్ చేసిందే డాక్యుమెంట్.. చెప్పిందే నిబంధనగా తయారైంది. డాక్యుమెంట్‌లో చిన్నచిన్న తప్పిదాలను సాకుగా చూపి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు సెలవులో వెళ్లడం, ఇన్‌చార్జులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం జిల్లా రిజిస్ట్రార్‌కు తలనొప్పిగా మారింది.
రైటర్లను కట్టడి చేయడంలో
విఫలం?
డాక్యుమెంట్ రైటర్లను కట్టడి చేయడంలో కార్యాలయ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. రైటర్లు చెప్పినట్లు చేయకుంటే అధికారులపైనే బెదిరింపులకు దిగడం, దుకాణాలు మూసేసి ఆందోళనలు చేసిన ఘటనలూ ఉన్నాయి. గతంలో ఓ రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడటంలో రైటర్ల పాత్ర ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. కలిసి పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లు చేస్తామంటే మాత్రం బెదిరింపులు ఎదుర్కోవాల్సిందే. రాష్ట్రంలో ఏ కార్యాలయంలోనూ ఈ పరిస్థితి లేదని, ఇక్కడే ఇలా ఉందని శాఖలోని ఓ ఉన్నతస్థాయి అధికారి పేర్కొనడం గమనార్హం. ఇప్పటికై నా రైటర్లను కట్టడి చేయకపోతే సబ్ రిజిస్ట్రార్లు పనిచేసే పరిస్థితి లేదనే అభిప్రాయం ఆ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
పది రోజుల్లో రెగ్యులర్
సబ్ రిజిస్ట్రార్లు
నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వారం, పదిరోజుల్లో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు వచ్చే అవకాశముంది. ఇక్కడికి రావడానికి సబ్ రిజిస్ట్రార్లు భయపడుతున్నారు. నిజామాబాద్ పరిస్థితిని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే మార్పులు, చేర్పులు ఉంటాయని భావిస్తున్నాం.
– వెంకటరమణ, డీఐజీ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్లశాఖ,
నిజామాబాద్
సీనియర్ అసిస్టెంట్లతో కొనసాగుతున్న అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం
ఆఫీస్‌లో డాక్యుమెంట్ రైటర్లదే హవా
సబ్ రిజిస్ట్రార్లుగా వచ్చేందుకు
జంకుతున్న అధికారులు
పర్యవేక్షణ లేక ఇన్‌చార్జుల
ఇష్టారాజ్యం!