
ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మొత్తం 126 ఫిర్యాదులు అందాయి. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలన్నారు.
వేతనాలు మంజూరు చేయండి..
కేజీబీవీలలో నూతనంగా నియమించబడ్డ నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాలు ఇప్పించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత ఐదు నెలల నుంచి వేతనాలు రావడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే వేతనాలు మంజూరు చేయించాలని కోరారు.
ఆన్‌లైన్‌లో భూవివరాలు నమోదు చేయాలి
ఆర్మూర్‌లోని వడ్డెర కాలానికి చెందిన పలువురు రైతులు తమ భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరారు. ఈమేరకు వారు కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించారు. సర్వే నంబర్ 189/20కి సంబంధించిన భూములు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని, సమస్యను అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే తమ భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరారు.
ప్రవేశ మార్గాలను మూయొద్దు
నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఇరువైపులా ఉన్న ప్రవేశ మార్గాలను రాత్రివేళ మూసివేయవద్దని వ్యాపారులు కోరారు. వారు ప్రజావాణిలో సమస్యను కలెక్టర్‌కు విన్నవించారు. రాత్రివేళ మార్కెట్ కమిటీకి ఇరువైపులా ఉన్న ప్రవేశం మార్గాలు మూసివేయడం వల్ల ఆ తర్వాత బయటకు వెళ్లేందుకు వీలుపడడం లేదన్నారు. అకస్మాత్తుగా ఏవైన ఘటన జరిగినా ఇబ్బందిగా ఉంటుందన్నారు.
కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
ప్రజావాణికి 126 ఫిర్యాదులు
మూడు నెలలుగా వేతనాలు లేవు..
జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదని జీపీ కార్మికులు, కారోబార్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు ఇప్పించాలని కోరుతూ వారు యూనియన్ నాయకులతో కలిసి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఎంపీడబ్ల్యూ విధానం తీసివేయాలన్నారు. ఈ విధానం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని కార్మికులు పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రవేశం మార్గం వద్ద కార్మికులు నిరసన చేశారు.

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి