
తెలంగాణపై కేంద్రం వివక్ష
నిజామాబాద్ సిటీ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని, రాష్ట్రానికి సరిపడా ఎరువులు కేటాయించకుండా పక్షపాతం వహిస్తోందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని హాకా భవన్ (సీడ్స్ కార్పొరేషన్)లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమ పాలన సాగిస్తుంటే ప్రధాని మోదీ సహకరించడం లేదన్నారు. కేంద్రమంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు తెలంగాణకు నిధులు తేవడంలో విఫలమయ్యారన్నారు. పంట పొలాలకు వాడే యూరియా కూడా సరిగా సరఫరా జరగడం లేదన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన కోటా కింద 5 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయిస్తే.. 3.06 లక్షల మెట్రిక్ టన్నులు రావడంతో 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందన్నారు. సరిపడా ఎరువులు లేకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఎరువుల కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లేఖలు రాశారని గుర్తుచేశారు. సంబంధిత కేంద్ర మంత్రులు జగత్ ప్రకాశ్ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్‌లపై బీజేపీ మంత్రులు, ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. బీజేపీ నాయకుల వైఖరి చూస్తుంటే.. వ్యవసాయాన్ని విధ్వంసం చేసి ఆ పాపాన్ని కాంగ్రెస్ మీదకు నెట్టే కుట్ర పూరిత వైఖరి అవలంబిస్తోందన్న అనుమానం కలుగుతోందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రైతు సంఘం నాయకులు నల్లమల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఎరువుల కేటాయింపులో జాప్యం
పట్టించుకోని కేంద్రమంత్రులు
తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి