
వేతనం లేక.. ఇంటికి రాలేక..
మోర్తాడ్(బాల్కొండ): ఎన్నో ఆశలతో ఉపాధిని వెతుక్కుంటూ కువైట్‌కు వెళ్లిన ముగ్గురు వలస కార్మికులు యజమాని వంచనతో నరకయాతన అనుభవిస్తున్నారు. భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్‌కు చెందిన నరేశ్, పవన్, కరీంనగర్ జిల్లా గన్నేరువరానికి చెందిన కోంపల్లి ప్రవీణ్‌లు తమ వేదనను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. కువైట్‌లో ఒక వ్యాపారి వద్ద పని కోసం ఏ జెంట్ల ద్వారా పది నెలల కింద వెళ్లారు. పనిచే యించుకున్న యజమాని చేసిన పనికి వేతనం ఇవ్వలేదు. జీతం లేకపోవడంతో యజమాని నుంచి పాస్‌పోర్టులు తీసుకుని బయటకు వచ్చా రు. ఫలితంగా వర్క్ పర్మిట్‌ను కోల్పోయారు. ఇంటికి వచ్చేందుకు ఎంబసీలో సంప్రదిస్తే క్రిమినల్ కేసు నమోదైనట్లు ఉందని, ఇంటికి వెళ్లలేరని అధికారులు స్పష్టం చేశారు. వేతనం ఇవ్వకుండా వేధించడమే కాకుండా యజమాని తమపై తప్పు డు కేసులు పెట్టాడని వలస కార్మికులు వాపోతున్నారు. కేసును ఎదుర్కొనేందుకు లాయర్‌కు ఫీజు చెల్లించే స్థోమత తమకు లేదని వలస కార్మికులు వెల్లడిస్తున్నారు. తాము పడుతున్న కష్టాల ను వీడియో రూపంలో ట్విట్టర్ ద్వారా బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు విన్నవించారు. హరీశ్‌రావు, కేటీఆర్‌లు స్పందించి తమను ఎలాగైనా ఇంటికి రప్పించాలని వారు వేడుకున్నారు. తమవారిని ఎలాగైనా తీసుకురావాలని బాధిత కుటుంబాల సభ్యులు కోరుతున్నారు.
కువైట్‌లో నరకయాతన
అనుభవిస్తున్న వలస కార్మికులు
స్వదేశానికి రప్పించాలని సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకోలు