
చేపల వేటపై నిషేధం
బాల్కొండ: చేపల పిల్లల ఉత్పత్తి కాలంగా పరిగణించే జూలై, ఆగస్టు నెలల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేపల వేటపై అధికారులు నిషేధం విధించారు. అయితే వేట నిషేధిత కాలంలో తమ పూట గడిచేది ఎట్లా అని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కలిపి 6 వేల మత్స్యకార కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. రెండు నెలల కాలానికి ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అందిన సాయం..
చేపల వేట నిషేధం అమలులో ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం, రూ.2 వేల నగదు అందించారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత సాయం అందడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలకు రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు అందించే వారని, ఇప్పుడు అందడం లేదని వాపోతున్నారు. సాయం అందించని పక్షంలో తమకు ప్రత్యామ్నాయ ఉపాధిని ప్రభుత్వం చూపించాలని అంటున్నారు.
ఎస్సారెస్పీలో రెండు నెలలపాటు..
వేట సాగకపోతే పూట గడిచేదెట్లా
అంటున్న మత్స్యకారులు
ఉమ్మడి రాష్ట్రంలో బియ్యం,
నగదు అందజేత
ప్రస్తుతం సాయం ఊసెత్తని వైనం
గతంలో ఇచ్చారు
జూలై, ఆగస్టు నెలలు చేపలు పిల్లలను అధికంగా ఉత్పత్తి చేసే కాలం కావడంతో ప్రతి ఏటా చేపల వేటను నిషేధిస్తారు. గతంలో మాకు బియ్యం, డబ్బులు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని ఆదుకోవాలి.
– భాస్కర్, మత్స్యకారుడు
చేపలను వేటాడొద్దు
చేపలు పిల్లలను జూలై, ఆగస్టు నెలల్లో సహజ సిద్ధంగా ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి రెండు నెలలపాటు చేపలను వేటాడొద్దు. నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకోవడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదు.
– దామోదర్, ఎఫ్‌డీవో, పోచంపాడ్

చేపల వేటపై నిషేధం