
పరిమితి లేని పెట్టుబడి సాయం
డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఊహించని విధంగా పంట పెట్టుబడి సాయాన్ని అందించింది. కొంత ఆలస్యమైనప్పటికీ ఎకరాల విషయంలో పరిమితి లేకుండా రైతులందరికీ ఖరీఫ్ సీజన్‌కు ‘భరోసా’ కల్పించింది. గత రబీ సీజన్‌లో పెట్టుబడిసాయాన్ని నాలుగు ఎకరాలకే పరిమితం చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం 36 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. దీంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రైతు వేదికల వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు సైతం నిర్వహించారు.
రూ.300 కోట్లకు పైగా..
జిల్లాలో 2,72,596మంది రైతులకు చెందిన 5,27,746 ఎకరాలకు మొత్తం రూ.316.64కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. పెట్టుబడి సాయం అందుకున్న వారిలో ఒక గుంట భూమి నుంచి 36 ఎకరాలున్న రైతులు కూడా ఉన్నారు. ఎకరానికి రూ.6వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించగా, ఎక్కువ భూమి ఉన్న రైతులు ఎక్కువ లబ్ది పొందారు. అత్యధికంగా బోధన్ మండలంలో 17,164 మంది రైతులు రూ.20.84 కోట్లు పొందారు. గత రబీ సీజన్‌లో అందిన పెట్టుబడి సాయాన్ని పరిశీలిస్తే నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న 2,32,484 మంది రైతులకు రూ.206.49 కోట్ల పెట్టుబడి సాయం అందింది. రబీతో పోలిస్తే చూస్తే ఖరీఫ్‌లో రైతుల కోసం ప్రభుత్వం రూ.110 కోట్లు అదనంగా వెచ్చించింది.
ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులందరికీ ‘భరోసా’!
36 ఎకరాలున్న రైతులకు కూడా
అందించిన ప్రభుత్వం
హర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులు