నా కుమారుడిపై తప్పుడు కేసులు | Sakshi
Sakshi News home page

నా కుమారుడిపై తప్పుడు కేసులు

Published Thu, Apr 18 2024 1:00 AM

-

బోధన్‌: తనపై రాజకీయ శత్రుత్వంతో తన కుమారుడు రహీల్‌ను టార్గెట్‌ చేసి పోలీసులు హింసిస్తున్నారని బోధన్‌ మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌ బుధవారం దుబాయ్‌ నుంచి విడుదల చేసి వీడియోలో ఆరోపించారు. రాజకీయ శత్రుత్వాలు మనం చూసుకుందామని, ఇందులో పిల్లలను ఇరికించి వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు. 2022 మార్చి 17న రాత్రి జూబ్లీ హిల్స్‌ రోడ్డులో తన కుమారుడి కారు ప్రమాద ఘటనపై మాజీ ఎమ్మెల్యే స్పందించారు. ఈ కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ నేతృత్వంలో పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసులు గంటల తరబడి విచారణ పేరిట హింసించారన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. తన కుమారుడి తప్పు నిరూపితమైతే ఉరిశిక్ష వేసినా అభ్యంతరం లేదన్నారు. ప్రమాదం జరిగిన రోజు తన కుమారుడు డ్రైవింగ్‌ చేయలేదని, అప్పట్లోనే పోలీసులు విచారణ జరిపి కేసులు నమోదు చేయడంతో పాటు చార్జిషీట్‌ దాఖలు చేయగా కోర్టు లో విచారణలో ఉందని వివరించారు. కారు యాక్సిడెంట్‌ కేసులో నిందితుడిగా ఉన్న డ్రైవర్‌ను బెదిరించి తన కుమారుడు డ్రైవింగ్‌ చేసినట్టు చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని షకీల్‌ ఆరోపించారు. ఈ కేసు విషయంలో కోర్టులో పోరాడుతామన్నారు త న కుమారుడికి ఎలాంటి హాని జరిగినా డీసీపీ విజయ్‌ కుమార్‌,పంజాగుట్ట, జూబ్లీ హిల్స్‌ పోలీసు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

21 సెక్షన్లతో కేసులు పెట్టడం న్యాయమా?

ప్రగతి భవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో తన కొడుకు రహీల్‌పై 21 సెక్షన్లతో కేసులు నమోదు చేశారని, ఇది న్యాయమా అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆ సమయంలో తాను దుబాయ్‌లో ఉన్నప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు చేర్చారన్నారు. రహీల్‌ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసి జ్యూడీషియల్‌ రిమాండ్‌కు పంపించారని, అయితే కోర్టు బెయిల్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలతో తాను దుబాయ్‌లో చికిత్స తీసుకుంటున్నానని షకీల్‌ తెలిపారు.

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే

మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌

 
Advertisement
 
Advertisement