పెట్టుబడి స్వల్పం.. ఆదాయం ఘనం | Sakshi
Sakshi News home page

పెట్టుబడి స్వల్పం.. ఆదాయం ఘనం

Published Thu, Apr 18 2024 1:00 AM

అంకాపూర్‌లో కొమ్ముల సాయారెడ్డి సాగు చేస్తున్న కొత్తిమీర - Sakshi

కొత్తిమీర సాగులో లాభాలు గడిస్తున్న రైతు

పెర్కిట్‌(ఆర్మూర్‌): డిమాండ్‌, సప్లయి అనే ఆర్థిక సూత్రాన్ని తమకు అన్వయించుకుని పంటలను సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు మార్కెట్‌పై పట్టు ఉన్న రైతులు. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో కొత్తిమీర పంటను సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌కు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు కొమ్ముల సాయారెడ్డి. తనకున్న 13 ఎకరాల్లో వరి, పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న పంటలను సాగు చేస్తున్నారు. అలాగే రెండు ఎకరాల్లో అర ఎకరం చొప్పున నాలుగు విడతలుగా కొత్తిమీరను సాగు చేస్తున్నారు. రంజాన్‌ మాసంలో కొత్తిమీరకు డిమాండ్‌ ఉండడంతో గత జనవరి నెల మొదటి వారంలో అర ఎకరంలో కొత్తిమీరను సాగు చేసి 45 నుంచి 50 రోజుల్లో సుమారు రూ.45 వేలు అర్జించారు. పంటకు డిమాండు ఉండడంతో వ్యాపారులే వ్యవసాయ క్షేత్రానికి వచ్చి టోకున ఖరీదు చేసి తీసుకెళ్తున్నారు.

డిమాండ్‌కు అనుగుణంగా..

పెళ్లిళ్ల సీజన్‌, రంజాన్‌ మాసం కావడంతో కొత్తిమీరకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ విషయం ముందే పసిగట్టిన రైతు సాయారెడ్డి రెండు ఎకరాల్లో నాలుగు విడతలు కొత్తిమీర సాగును చేపట్టారు. రంజాన్‌ మాసానికి అందడానికి జనవరి నెలలో మొదటి దఫాగా విత్తనాలను విత్తుకున్నాడు. జనవరి చివరి వారంలో రెండో దఫాగా కొత్తిమీర సాగు చేపట్టాడు. మార్చి మూడో వారంలో పంట చేతికి వచ్చింది. అలాగే ఫిబ్రవరి 10న మళ్లీ మార్చి 1న మూడు, నాలుగు దఫాలుగా కొత్తిమీర విత్తనాలను విత్తుకున్నాడు. కొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుంది.

తక్కువ పెట్టుబడి..

కేవలం 45 రోజుల స్వల్ప కాల పంట అయిన కొత్తిమీర సాగుకు పెట్టుబడి అంతంత మాత్రమే అవుతుంది. ఒక ఎకరంలో విత్తనాలకు రూ.7 వేలు, సస్యరక్షణ, ఎరువులకు రూ. 13 వేలు అయ్యాయి. పెట్టుబడి పోగా రైతుకు ఎకరానికి రూ.70 వేలు గిట్టుబాటు అయింది.

సేంద్రియ ఎరువులు వినియోగించా..

మార్కెట్‌లో లోకల్‌ కొత్తిమీరకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దీంతో కొత్తిమీర సాగులో సేంద్రియ ఎరువులు వినియోగించాను. అలాగే పసుపు పంట పూర్తి కాగానే కొత్తి మీరను సాగు చేయడంతో దిగుబడి పెరిగింది. నాలుగు విడతలుగా సాగు చేయడంతో మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నపుడు మంచి ధర లభిస్తుంది.

– కొమ్ముల సాయారెడ్డి, రైతు, అంకాపూర్‌

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement