కమనీయం.. రాములోరి కల్యాణం | Sakshi
Sakshi News home page

కమనీయం.. రాములోరి కల్యాణం

Published Thu, Apr 18 2024 1:00 AM

శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు  - Sakshi

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. భక్తుల జయజయ ధ్వానాల నడుమ రాములోరు సీతమ్మ మెడలో తాళి కట్టారు. ఉదయం 11.00 గంటలకు శ్రీరాముడి జననం (డోలారోహణం) కార్యక్రమం నిర్వహించారు. బాల రాముడిని ఊయలలో వేసి లాలి పాటలు పాడారు. మధ్యాహ్నం 12.01 గంటలకు ఆలయ ప్రధానార్చకులు సుమిత్‌శర్మ దేశ్‌పాండే ఆధ్వర్యంలో వేద పండితులు సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గజవాడ రాందాస్‌గుప్తా కుటుంబ సభ్యులు శ్రీసీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, పుస్తె, మట్టెలు సమర్పించారు. పలువురు భక్తులు కన్యాదానం చేసి కట్నకానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

వేడుకల్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు

డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో కల్యాణ వేడుకల్లో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. కల్యాణం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరామచంద్రస్వామి వారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కలిసి మాట్లాడినట్లు తెలిపారు. టీపీసీసీ డెలిగేట్‌ బాడ్సి చంద్రశేఖర్‌గౌడ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ జంగం శాంతయ్య, మాజీ చైర్మన్‌ పొద్దుటూరి మహేందర్‌రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్‌ గజవాడ జైపాల్‌, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

దర్శించుకున్న ఎంపీ అభ్యర్థులు

బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్‌ కల్యాణ వేడుకలకు హాజరయ్యారు. శ్రీసీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. డిచ్‌పల్లి సీఐ మల్లేశ్‌, ఎస్సై మహేష్‌, ఇందల్వాయి ఎస్సై మనోజ్‌కుమార్‌, సిబ్బంది ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్త గజవాడ రాందాస్‌ గుప్తా కుటుంబ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. బచ్చు రాములు గుప్తా ఆధ్వర్యంలో పులిహోర, యూత్‌సభ్యులు పానకం, వడపప్పు భక్తులకు పంపిణీ చేశారు. రాత్రి 7 గంటలకు శ్రీసీతారామ స్వామి వారికి అశ్వ వాహన సేవ నిర్వహించారు.

డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో డోలారోహణంలో ఎంపీ అర్వింద్‌
1/1

డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో డోలారోహణంలో ఎంపీ అర్వింద్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement