మద్యం మత్తులో కిందపడి మృతి | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కిందపడి మృతి

Published Wed, Apr 17 2024 1:10 AM

- - Sakshi

ఆర్మూర్‌టౌన్‌: మద్యం మత్తులో కిందపడి మహారాష్ట్రకు చెందిన మారుతి(32) అనే వ్యక్తి మృతి చెందాడు. మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న ప్రభు మెకానిక్‌ గ్యారెజ్‌లో ఈ ఘటన చోసుకుంది. ఎస్‌హెచ్‌వో రవికుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక ప్రభు గ్యారెజ్‌లో పనిచేస్తూ అక్కడే ఉండే మారుతి రోజులాగే యజమాని నాగబాబు ఇంటి నుంచి సోమవారం రాత్రి 9గంటలకు భోజనం తెచ్చుకున్నాడు. మంగళవారం ఉదయం గ్యారేజీలో కిందపడిఉన్న మారుతిని లేపేందుకు డ్రైవర్లు ప్రయత్నించగా.. అతడు లేవకపోవడంతో యజమానికి సమాచారం అందించారు. ఆయన గ్యారేజీకి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మారుతి మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

చేపల వేటకు వెళ్లిన యువకుడు..

ఇందల్వాయి: మండల కేంద్రానికి చెందిన మైస శ్రీకాంత్‌(37) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. శ్రీకాంత్‌ మంగళవారం గ్రామశివారులోని పెద్దచెరువు కింద ఉన్న పెద్దకచ్చు కాలువలో చేపలుపట్టేందుకు వెళ్లాడు. చేపలను వేటాడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటమునిగి మృతి చెందాడు. మృతుడి అన్నయ్య మైస శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గుండెపోటుతో కాంగ్రెస్‌ నాయకుడు..

రాజంపేట: మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, పట్టణ మాజీ అధ్యక్షుడు రంగ గంగాధర్‌గౌడ్‌ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం గంగాధర్‌గౌడ్‌కు గుండెపోటురాగా కుటుంబ సభ్యులు కామారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ సోదరుడు, సీనియర్‌ నాయకుడు నయీం.. షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌ తరపున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు యాదవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు బెస్త చంద్రం, నాయకులు తదితరులు గంగాధర్‌గౌడ్‌ మృతికి సంతాపం తెలిపారు.

పరిస్థితి విషమించి ‘ఉపాధి’ కూలీ..

నవీపేట: ఉపాధి హామీ పనులకు వెళ్లి గుండెపోటుకు గురైన ఉపాధిహామీ కూలీ ర్యాగల్ల లావణ్య అలియాస్‌ లక్ష్మీనర్సమ్మ(42) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. సోమవారం ఉదయం నవీపేట శివారులోని చెరువులో పూడికతీత పనులకు వెళ్లిన లావణ్య వాంతులు చేసుకుని గుంపోటుకు గురైంది. ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగాా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.

కంజర్‌లో చైన్‌స్నాచింగ్‌

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): ధాన్యం ఆరబోస్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటన మండలంలోని కంజర్‌ శివారులో మంగళవారం చేసుకుందని ఎస్సై గంగాధర్‌ తెలిపారు. అరికెల లక్ష్మి కంజర్‌ – మోపాల్‌ రోడ్డుపై వడ్లు ఆరబోస్తుండగా, ఎరుపు రంగు స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను మాటల్లో పెట్టారు. చుట్టుపక్కల ఎవరూలేని సమయంలో లక్ష్మి మెడలోని చైన్‌ను లాక్కెళ్లిపోయారు. నిందితుల ఆనవాళ్లను పోలీసులు సీసీ ఫుటేజీలో గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

1/1

Advertisement
 
Advertisement