పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం

Published Mon, Nov 27 2023 12:46 AM

 సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అర్బన్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీ  - Sakshi

ఖలీల్‌వాడి: పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యమని, పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పైసా పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడుతుందని అర్బన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. నగరంలోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో ఆదివారం మాల సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో షబ్బీర్‌అలీ పాల్గొని వారి మద్దతు కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో మాదిగ ఓటు బ్యాంకును రాబట్టుకోవడం కోసం బీజేపీ, పీఎం మోదీ ఎన్ని కుట్రలు చేసినా దళితులు కాంగ్రెస్‌ వెంటే ఉంటారన్నారు. మాలల్లో ఐక్యత రావాలని, చదువుతోనే గు ర్తింపు వస్తుందన్నారు. నిజానికి మాల ఉపకులాలు అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నాయన్నారు. అంబేడ్కర్‌ అంటరాని జాతులన్నీ ఐక్యతతో ఉండాలన్నారని, ఎస్సీలలో కులాలు విచ్ఛిన్నం కాకూడదని అన్నారు. దళిత జాతి రాజకీయ అధికారంలోకి రాకుండా పూర్తిగా బానిసలుగా ఉంచాలని మనువాదులు అనుకుంటున్నారని తెలిపారు. దళితుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది ఇందిరాగాంధీ అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎమ్మెల్యే బంధువులకే అన్ని పథకాలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీ పథకాలు అమలైతే పేద కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

కోజా కమ్యూనిటీ నేతలతో సమావేశం..

నగరంలోని కోజా కాలనీలో ఆదివారం కోజా కమ్యూనిటీ నాయకులతో షబ్బీర్‌ అలీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికల్లో వారి మద్దతును కోరారు. ఈసందర్బంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. కోజా లేదా ఖువాజా ప్రధానంగా నిజారీ ఇస్మాయిలీ షియా సమాజమన్నారు. కోజా అనే పదం పర్షియన్‌ పదం ఖ్వాజా నుంచి ఉద్భవించిందని తెలిపారు. అర్బన్‌లో కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత మిమ్మల్ని కలుపుకొని పట్టణాభివృద్ధిలో, సమాజ సేవలో ముందు వరుసలో ఉంటానని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌

అభ్యర్థి షబ్బీర్‌ అలీ

మాలసంఘ ప్రతినిధులతో కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీ, కాంగ్రెస్‌ నేతలు
1/1

మాలసంఘ ప్రతినిధులతో కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీ, కాంగ్రెస్‌ నేతలు

Advertisement
 
Advertisement