ఆర్మూర్‌లో ముక్కోణపు పోటీ.. | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌లో ముక్కోణపు పోటీ..

Published Fri, Nov 17 2023 12:38 AM

- - Sakshi

ఆర్మూర్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ నెలకొననుంది. నామినేషన్లు, ఉపసంహరణల అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ఆశన్నగారి జీవన్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌), పైడి రాకేశ్‌రెడ్డి (బీజేపీ), వినయ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)ల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. పార్టీ అభ్యర్థిత్వం ముందుగానే ఖరారు కావడంతో జీవన్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

బీజేపీ శ్రేణులను ఏకం చేస్తూ ఇన్నేళ్లు నాయకత్వ లోపంతో పార్టీకి దూరంగా ఉన్న వారిని కలుపుకొంటూ రాకేశ్‌రెడ్డి సైతం ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. వినయ్‌ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారం చేపడుతున్నారు. మూడు జాతీయ పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ఈ పోటీ నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఆర్మూర్‌ మున్సిపల్‌తో పాటు ఆర్మూర్‌, నందిపేట, మాక్లూర్‌, ఆలూర్‌, డొంకేశ్వర్‌ మండలాలు ఉన్నాయి.

నియోజకవర్గంలో 2,10,217 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 98,274, మహిళలు 1,11,937, ఇతరులు ఆరుగురు ఉన్నారు. 2011 గణాంకాల ప్రకారం ఆర్మూర్‌ నియోజకవర్గ జనాభా 2,51,173 కాగా అందులో పురుషులు 1,21,628, మహిళలు 1,29,545 మంది ఉన్నారు. ఆర్మూర్‌ అసెంబ్లీకి 1952 నుంచి ప్రారంభిస్తే ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.

Advertisement
Advertisement