సం‘గ్రామం’లో యువతరం
లక్ష్మణచాంద: గ్రామాలే దేశ అభివృద్ధి పట్టుకొమ్మలు..అన్నారు మహాత్మ గాంధీ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు స్వామి వివేకానంద. ఒకప్పుడు రాజకీయాలు అంటే అమ్మో అనే యువత క్రమంగా ఇప్పుడు రాజకీయలవైపు చూస్తోంది. మారుతున్న పరిస్థితులు, నిరుద్యోగం, గ్రామాల్లో సమస్యలు తదితర కారణాలతో రాజకీయాల్లోకి వస్తోంది. తమ తర్వాతి తరాలకు మెరుగైన గ్రామాన్ని ఇచ్చేందుకు సంకల్పంతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో యువత బరిలో దిగింది. 18 మండలాల్లో 400 పంచాయతీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో ఎన్నికల బరిలో 550 మందికిపైగా యువత పోటీలో ఉంది. వీరిలో సగానికిపైగా తొలిసారి పోటీ చేస్తున్నవారే.
మీ ఇంటి ఆడ బిడ్డగా అవకాశం ఇవ్వండి..
మీ ఇంటి ఆడ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా.. నన్ను ఆదరించంచాలని కోరుతున్నారు సోన్ మండల కేంద్రం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన యువతి సుప్రియ(25). యువతీ, యువకు ల కో సం ఒక వేదిక ఏర్పాటు చేయడం, మెరుగైన విద్య, వైద్యం అందేలా చూడడమే తన తొలి ప్రాధాన్యమని పేర్కొంటున్నారు. పాఠశాల అభివృద్ధి, గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నారు. 30 ఏళ్లుగా గ్రామంలో అభివృద్ధి జరగడం లేదని, తనను మీ ఆడ బిడ్డగా ఆదరిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొంటున్నారు.
అందివచ్చిన అవకాశం
లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి(కె) సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయింది. గ్రామానికి చెందిన చింతకింది ముఖేష్(23) సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాడు. గ్రామ ఓటర్లు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాల అభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపట్టి గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని, ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అంటున్నాడు.
సం‘గ్రామం’లో యువతరం
సం‘గ్రామం’లో యువతరం


