శాంతిభద్రతల విషయంలో రాజీ వద్దు
భైంసాటౌన్: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దని ఏఎస్పీ రాజేశ్‌మీనా సూచించారు. భైంసా నూతన ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం పట్టణంలోని పలు కీలక ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడి సిబ్బందితో సమావేశమయ్యారు. విధి నిర్వహణపై అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు చేశారు. పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా సేవలందించాలన్నారు. అనంతరం పట్టణంలోని కోతిదేవుని ఆలయం, పంజేషా మసీదు, జుల్ఫికార్ మసీదును సందర్శించి, అక్కడి భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించారు. అవసరమైన చోట మరింత బలగాల మోహరింపు, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలపై సూచనలు చేశారు. అలాగే ఎస్డీపీవో కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట సీఐ నైలు, ఎస్సైలు జుబేర్, సుప్రియ ఉన్నారు.


