● జాడలేని ఇంటికో ఇంకుడు గుంత ● అడుగంటుతున్న భూగర్భ జలాలు ● కానరాని ముందుచూపు చర్యలు ● జిల్లాలోనూ తప్పని నీటి తిప్పలు ● మేల్కోకుంటే మరో ‘బెంగ’ళూరే! | Sakshi
Sakshi News home page

● జాడలేని ఇంటికో ఇంకుడు గుంత ● అడుగంటుతున్న భూగర్భ జలాలు ● కానరాని ముందుచూపు చర్యలు ● జిల్లాలోనూ తప్పని నీటి తిప్పలు ● మేల్కోకుంటే మరో ‘బెంగ’ళూరే!

Published Fri, Apr 12 2024 1:15 AM

- - Sakshi

నిర్మల్‌: బెంగళూరు.. దేశ ఐటీ రాజధాని. అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోంది. అలాంటి మహానగరం ఇప్పుడు మంచినీటి కోసం అల్లాడుతోంది. కనీసం వాటర్‌ బాటిల్స్‌ కొందామన్నా స మీపంలో దొరకని దుస్థితి. కిలోమీటర్ల దూరం నుంచి, రూ.వేలు చెల్లించి ట్యాంకర్ల ద్వారా నీటిని తె ప్పించుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్‌లోనూ దా దాపు ఇలాంటి పరిస్థితే. ఇలా ఎందుకు అంటే.. మహానగరాల్లో నేల కనిపించకపోవడమే. ఎటుచూసినా సిమెంటు రోడ్లు, కనీసం వాకిలి లేకుండానే ఇ ళ్లు కట్టేస్తున్నారు. ఇక ఆకాశం నుంచి వచ్చిన నీటిచు క్క నేలలో ఇంకితేనే కదా.. బోర్లు, బావుల్లోకి నీరు చేరేది. మళ్లీ నీళ్లు వచ్చేది. ఇంటికో ఇంకుడుగుంత ఉండాలి. కానీ.. దాన్ని పట్టించుకోవడమే లేదు. ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు మహానగరాలను గుక్కెడు నీటికోసం అల్లాడేలా చేస్తోంది. ఇదే పరిస్థితి రేపోమాపో మన ఊళ్లల్లోనూ వచ్చేలా ఉంది.

ముందుచూపేది..?

జిల్లాలో ఓవైపు జలాశయాలు ఖాళీ అవుతున్నాయి. మరోవైపు భూగర్భజలాలూ అడుగంటి పోతున్నాయి. కనుచూపు మేరలోనే కరువుచాయలు కనిపిస్తున్నాయి. ఇందుకు పాలకులు, అధికారుల్లో ముందుచూపు లేకపోవడమే కారణమన్న వాదనలు వస్తున్నాయి. సాగుకే కాదు.. తాగునీటికీ జిల్లాలోని చాలా గ్రామాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బోరుబావులు చాలావరకు ఎత్తిపోతున్నాయి. ఇంటికో ఇంకుడుగుంత నిర్మించాలని ఉన్నా.. కనీసం పట్టించుకోవడం లేదు. ఏళ్లుగా నీటిని ఒడిసిపట్టకపోవడంతోనే ఇప్పుడు కరువు తరుముకొస్తోంది.

ఇంటికో ఇంకుడుగుంతెక్కడ..!

ప్రతీ ఇంటికో ఇంకుడుగుంత ఉండాలి. కొత్త ఇల్లు నిర్మాణానికి పర్మిషన్‌ తీసుకునేటప్పుడే ఇంకుడుగుంత నిర్మాణం తప్పనిసరిగా ఉంటుంది. ఇది చట్టాల్లో పక్కాగా ఉంది కానీ.. ఎక్కడా ఇది అమలు కావడం లేదు. సంబంధిత అధికారులూ పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా ఏళ్లుగా ఇంకుడుగుంతల నిర్మాణం, వాననీటిని ఒడిసిపట్టుకోవాలన్న అంశాలపై ప్రచారం చేస్తూనే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో నామమాత్రంగానే అమలవుతోంది. మున్సిపాలిటీలలో సైతం ఇంకుడు గుంతల నిర్మాణం కనిపించడం లేదు. ఇంటికో బోరు వేసుకుంటున్నారు కానీ.. ఆ బోరుబావిని రీచార్జ్‌ చేసే విధానంపై మాత్రం దృష్టిపెట్టడం లేదు.

రికార్డుస్థాయిలో..

భూగర్భజలాల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా ‘క్యాచ్‌ ది రెయిన్‌’ పేరిట అవగాహన కార్యక్రమాన్ని చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గత ఏడాది రికార్డుస్థాయిలో 5,940 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. కానీ ఇవన్నీ.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే నిర్మించారు. ఇదొక అవగాహన కార్యక్రమంగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ ఏడాది కూడా క్యాచ్‌ దిరెయిన్‌ పేరిట కార్యక్రమంలో భాగంగా బోరువెల్‌ రీచార్జ్‌ గుంతలను నిర్మిస్తున్నారు. కానీ.. వీటి ఉద్దేశం అందరికీ చేరడం లేదు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం లేదు. అందుకే తరచూ భూగర్భ జలాల సమస్య వస్తోంది. జనం మేల్కొంటేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

పడిపోతున్న పాతాళగంగ..

జిల్లాలో గతనెలకు ఈనెలకే ఒకమీటర్‌ లోతు కు భూగర్భ జలాలు పడిపోయాయి. మార్చి లో 9.01 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా, ఏప్రిల్‌ కు వచ్చేసరికి 10.19 మీ టర్ల లోతుకు పడిపోయా యి. ప్రస్తుతం వ్యవసాయ పనులు కొనసాగుతుండటం, వేసవి కావడంతో రోజురోజుకూ నీటి విని యోగం పెరుగుతుండటమూ ఇందుకు కారణంగా చెప్పవచ్చు. జిల్లాలో మిగితాచోట్లతో పోలిస్తే ముధోల్‌ నియోజకవర్గంలోని కుంటాల, తానూరు, భైంసా, ముధోల్‌, బాసర, కుభీర్‌ తదితర మండలాల్లో భూగర్భజలాల లభ్యత కష్టంగా మారుతోంది.

‘రీచార్జ్‌’ చేస్తేనే కదా..

సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్‌ అయిపోతే ఎలాగైతే వెంటనే రీచార్జ్‌ చేస్తామో.. భూగర్భజలాలు ఇంకిపోకుండా ఉండటానికీ ‘రీచార్జ్‌’ అవసరమే. ఇందుకు ప్రతీఇంట్లో రెండురకాల ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలి. ఇంట్లో బట్టలు ఉతకడానికి, వంటపాత్రలు కడగటానికి, స్నానదుల్లో ఉపయోగించిన నీరు భూమిలోకి వెళ్లడానికి ‘సోక్‌పిట్‌’ నిర్మించుకోవాలి. ఇక వర్షాకాలంలో వర్షపునీరు వృథాగా పోకుండా ఉండేందుకు బోర్లు, బావులకు దగ్గరగా ‘రీచార్జ్‌పిట్‌’ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ రెండు గుంతలు ప్రతీఇంట్లో ఉంటే చాలావరకు భూగర్భజలాల సమస్య రాదని భూగర్భజలాల శాఖాధికారులు చెబుతున్నారు.

ఇంకుడుగుంతలపై అవగాహన..

జిల్లాలో ఇంకుడుగుంతల నిర్మాణాలపై కలెక్టర్‌ ఆదేశా ల మేరకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. గతేడాది రికార్డుస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్మించాం. ఈఏడాది కొనసాగిస్తున్నాం. ఓపెన్‌ బావుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. జిల్లావాసులు తమ ఇళ్లల్లోనూ ఇంకుడుగుంతల నిర్మాణానికి ముందుకు రావాలి. – విజయలక్ష్మి, డీఆర్డీవో

నీటిని కాపాడుకోవాలి..

ప్రతీ నీటిచుక్క విలువైనదే. మనకు జలవనరులు అందుబాటులో ఉన్నాయని విరివిగా వినియోగిస్తే వాటి కొరత ఉన్నప్పుడు విలువ తెలుస్తుంది. ప్రతీ ఇంట్లో సోక్‌పిట్‌, రీచార్జ్‌పిట్‌ నిర్మించుకుని, భూగర్భజలాలను కాపాడుకోవాలి.

– శ్రీనివాసరావు, డిప్యూటీడైరెక్టర్‌,

భూగర్భజలశాఖ

జిల్లాలో నిర్మిస్తున్న ఇంకుడుగుంతను చూపుతున్న డీఆర్డీవో విజయలక్ష్మి
1/3

జిల్లాలో నిర్మిస్తున్న ఇంకుడుగుంతను చూపుతున్న డీఆర్డీవో విజయలక్ష్మి

2/3

3/3

Advertisement
Advertisement