మహిళపై దురుసుగా ప్రవర్తించిన సెక్యూరిటీగార్డు | Sakshi
Sakshi News home page

మహిళపై దురుసుగా ప్రవర్తించిన సెక్యూరిటీగార్డు

Published Fri, Apr 12 2024 1:10 AM

-

ఆదిలాబాద్‌టౌన్‌: రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు వచ్చిన నేరడిగొండ మండలానికి చెందిన ఓ మహిళపై రిమ్స్‌ సెక్యూరిటీగార్డు దురుసుగా ప్రవర్తించినట్లు బాధితురాలు పేర్కొంది. తాను లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా చేయిపట్టి నెట్టివేశాడని తెలిపింది. ఇదే విషయమై తన బంధువు ఎందుకిలా ప్రవర్తించావని ప్రశ్నించగా అతనిపై నలుగురు సెక్యూరిటీగార్డులు దాడి చేసినట్లుగా బాధిత మహిళ పేర్కొంది. దీంతో కొద్దిసేపు రిమ్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి రిమ్స్‌ సెక్యురిటీగార్డులతో పాటు బాధిత మహిళ, కుటుంబసభ్యులు పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా సెక్యురిటీగార్డును మహిళ బంధువు చొక్కకాలర్‌ పట్టుకున్నారని, తాము ఎవరినీ నెట్టివేయలేదని, ఎలాంటి దాడి చేయలేదని వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్‌, డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్‌ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి పంపించేశారు.

Advertisement
Advertisement