కరోనాకు కొత్త మందు! 

Thapsigargin Could Be Used As Antiviral To Treat COVID-19 - Sakshi

మొక్కల నుంచి తీసిన యాంటీ వైరల్‌ డ్రగ్‌

ఇంజెక్షన్‌ సహా టాబ్లెట్స్‌ రూపంలోనూ ..

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 చికిత్సకు మరో కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. థాప్సీగార్గిన్‌ అనే యాంటీ వైరల్‌ డ్రగ్‌ కోవిడ్‌–19 వైరస్‌పై సమర్థంగా పని చేయగలదని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హామ్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ జలుబు, రెస్పిరేటరీ సిన్సీషియల్‌ వైరస్, ఇన్‌ఫ్లుయెంజా–‘ఎ’వైరస్‌లపై ఈ మందు ప్రభావం చూపగలదు. ఊపిరితిత్తుల సమస్యలు సృష్టించే కరోనా, ఇతర వైరస్‌లపై ఒకేసారి సమర్థంగా పనిచేసే మందు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీతో పాటు చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని యానిమల్‌ అండ్‌ ప్లాంట్‌ హెల్త్‌ ఏజెన్సీ, ఇంగ్లండ్‌లోని పిర్‌బ్రైట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి.

మొక్కల నుంచి తీసిన యాంటీ వైరల్‌ మందు తక్కువ మోతాదులో వాడితే కోవిడ్‌–19 సహా మూడు రకాల వైరస్‌లకు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయొచ్చని తేలింది. వ్యాధి రాక ముందు, సోకిన తర్వాత కూడా ఈ మందు సమర్థంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాధి కారక వైరస్‌ తన నకళ్లను సృష్టించుకోకుండా అడ్డుకుంటుంది. మన కడుపులోని ఆమ్ల గాఢతకు సమానమైన వాతావరణంలోనూ స్థిరంగా ఉంటుంది. దీంతో ఇంజెక్షన్‌ రూపంలోనే కాకుండా మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాంటీవైరల్‌ మందుల కంటే వందల రెట్లు ఎక్కువ సమర్థంగా పనిచేస్తుందని ప్రాథమిక అంచనా. దుష్ప్రభావాలు చాలా తక్కువ. భవిష్యత్తులో కోవిడ్‌–19 లాంటి వైరస్‌లు విజృంభిస్తే చికిత్స అందించేందుకు అవసరమైన సామర్థ్యం థాప్సీగార్గిన్‌కు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top