Lok sabha elections 2024: జాతీయ పార్టిలకు... ద్రవిడ స్వప్నం! | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: జాతీయ పార్టిలకు... ద్రవిడ స్వప్నం!

Published Tue, Apr 16 2024 12:42 AM

Lok sabha elections 2024: BJP and Congress Party builds alliances with smaller partys in Tamil nadu - Sakshi

తమిళనాట హోరాహోరీ

ఎలాగైనా పాగా వేసే ప్రయత్నాల్లో బీజేపీ

కాంగ్రెస్‌–డీఎంకే వైపే సర్వేల మొగ్గు

నామమాత్రంగా మారిన అన్నాడీఎంకే

దక్షిణాదిన జాతీయ పార్టిలకు కొరకరాని కొయ్యగా నిలుస్తున్న రాష్ట్రాల్లో ప్రధానమైనది తమిళనాడు! 50 ఏళ్లకు పైగా ఇక్కడ ప్రాంతీయ పార్టిలదే హవా. తమిళులు కూడా సినీ గ్లామర్, ప్రాంతీయ సమస్యలు, అంశాలకే ప్రాధాన్యమిస్తారు. కానీ 39 లోక్‌సభ స్థానాలతో సీట్లపరంగా దేశంలో ఐదో అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడును పక్కనపెట్టే పరిస్థితి లేదు. దాంతో కాంగ్రెస్, బీజేపీ ఇక్కడి ప్రాంతీయ పార్టితో పొత్తులు పెట్టుకోక తప్పడం లేదు. ఈసారి మాత్రం రాష్ట్రంలో బీజేపీ గట్టిగా ఉనికిని చాటే ప్రయత్నాల్లో ఉంది...

ఇండియా కూటమిదే
హవా? ఒకప్పుడు కరుణానిధి డీఎంకే, జయలలిత అన్నాడీఎంకేలకు కంచుకోటైన నిలిచిన తమిళనాట వారి తదనంతరం పరిస్థితులు మారుతున్నాయి. అన్నాడీఎంకే వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీ బలహీనపడటంతో ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేసి ఈ కీలక దక్షిణాది రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌ కూడా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పాలక డీఎంకేతో జట్టుకట్టింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన యూపీఏ కూటమి ఎన్డీఏను మట్టికరిపించింది. ఏకంగా 38 సీట్లను ఎగరేసుకుపోయింది. స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే 23 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు చేజిక్కించుకుంది. కాంగ్రెస్‌ 9 స్థానాలకు 8 దక్కించుకుంది. సీపీఐ, సీపీఎం చెరో రెండు, ఇతర చిన్న పార్టీలు ఒక్కో సీటు గెలుచుకున్నాయి.

2014 లోక్‌సభ ఎన్నికల్లో జయలలిత సారథ్యంలో 37 స్థానాలు కొల్లగొట్టిన అన్నాడీఎంకే 2019లో బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి బొక్కబోర్లా పడింది. 21 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు గెలుచు కుంది. బీజేపీ, పీఎంకే, డీఎండీకే, టీఎంసీ (ఎం) ఖాతా కూడా తెరవలేదు. ఈసారి ఇండియా కూటమి నుంచి డీఎంకే 21, కాంగ్రెస్‌ 9, సీపీఐ, సీపీఎం, వీసీకే రెండేసి స్థానాల్లో, ఎండీఎంకే, ఐయూఎంఎల్‌ చెరో చోట పోటీ చేస్తున్నాయి. ఒక స్వతంత్రుడు డీఎంకే మద్దతుతో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారు.

అవినీతి వర్సిటీకి చాన్సలర్‌ మోదీ
దేశంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ బీజేపీయే. అవినీతి పేరుతో యూనివర్సిటీ పెడితే దానికి మోదీయే చాన్సలర్‌ అవుతారు. ఆ అర్హతలన్నీ ఆయనకే ఉన్నాయి.
– చెన్నై రోడ్‌షోలో సీఎం స్టాలిన్‌

బీజేపీ పాగా వేసేనా?
ద్రవిడ రాజ్యంలో పాగా వేయాలని తహతహలాడుతున్న కమలనాథులకు అన్నాడీఎంకే దూరమవడంతో ఈసారి ఆదిలోనే షాక్‌ తగిలింది. దాంతో చిన్నాచితకా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. జీకే వాసన్‌ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ (ఎం)కు 3, ఎస్‌.రాందాస్‌కు చెందిన పట్టాలి మక్కల్‌ కచి్చకి 10, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)కు 2 సీట్లు కేటాయించింది. మరో 4 చోట్ల కూటమిలోని ఇతర పక్షాలు కమలం గుర్తుపై పోటీ చేయనున్నాయి.

అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్‌సెల్వంకు బీజేపీ మొండిచేయి చూపింది. ప్రధాని మోదీ తమిళనాట సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అయోధ్య, డీఎంకే అవినీతి, కుటుంబ పాలనను ప్రచారా్రస్తాలుగా మలచడంతో పాటు తమిళ భాషకు పెద్దపీట వేస్తామంటూ పదేపదే ప్రకటిస్తున్నారు. దివంగత విజయకాంత్‌ పార్టీ డీఎండీకే (5 సీట్లు), మరో రెండు పార్టిలతో (చెరో సీటు) అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తోంది. 32 చోట్ల ఆ పార్టీ బరిలో ఉంది.

అన్నామలై... బీజేపీ తురుపుముక్క
బీజేపీకి తమిళనాట ఎట్టకేలకు కె.అన్నామలై రూపంలో ఫైర్‌బ్రాండ్‌ నాయకుడు దొరికారు. 2021లో 36 ఏళ్ల అతి చిన్న వయసులో పార్టీ పగ్గాలు అందుకుని శరవేగంగా కీలక నేతగా ఎదిగారు. ‘సింగమ్‌ అన్న’గా పేరొందిన ఈ మాజీ ఐపీఎస్‌ మొత్తం పాదయాత్రతో క్రేజ్‌ సంపాదించారు. డీఎంకే అవినీతిని ఎండగట్టడంతో పాటు హిందుత్వ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దూకుడు, వాగ్ధాటితో బీజేపీకి జోష్‌ తెచ్చారు. కోయబత్తూరు నుంచి బరిలో ఉన్నారు.

రాజధానిని నాగపూర్‌కు ఎలా మారుస్తారు? అర్థంపర్థముందా? కమల్‌ పిచ్చాసుపత్రికి వెళ్లి చెక్‌ చేయించుకుంటే మంచిది. డీఎంకే ప్రాపకం, రాజ్యసభ స్థానం కోసమే ఆయన పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు
– కోయంబత్తూరు ర్యాలీలో అన్నామలై

ఐదుగురు ‘సినీ’ సీఎంలు
తమిళ రాజకీయాలకు, సినిమాలకు బ్రిటిష్‌ కాలం నుండీ విడదీయరాని బంధం! నాటి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) నుండి తాజాగా విజయ్‌ దాకా వెండితెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోకి వచి్చనవారే. సినీ పరిశ్రమ నుంచి తమిళనాట ఐదుగురు ముఖ్యమంత్రులయ్యారు. ద్రవిడ సిద్ధాంతాలను సినిమాల్లో చొప్పించిన వారిలో రాష్ట్ర తొలి ద్రవిడ సీఎం సీఎన్‌ అన్నాదురై ముందుంటారు.

ఇక కవిగా, స్క్రీన్‌ప్లే, సంభాషణ రచయితగా పేరొందిన ఎం.కరుణానిధి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడైన తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్‌ కూడా ముఖ్యమంత్రులయ్యారు. ఎంజీఆర్‌ మరణానంతరం అతి స్వల్పకాలం పాటు సీఎంగా చేసిన ఆయన భార్య జానకీ రామచంద్రన్‌ కూడా సినీ నటే. అనంతరం ఎంజీఆర్‌ వారసురాలైన స్టార్‌ హీరోయిన్‌ జయలలిత సీఎంగా చెరగని ముద్ర వేశారు.

తర్వాతి తరంలో విజయకాంత్‌ (ఎండీఎంకే), కమల్‌హాసన్‌ (మక్కల్‌ నీది మయం) పార్టిలు పెట్టినా రాణించలేదు. కమల్‌ ఈసారి ఇండియా కూటమికి మద్దతు తెలిపారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ పెట్టినంత పని చేసి చివరికి విరమించుకున్నారు. తాజాగా సూపర్‌స్టార్‌ విజయ్‌ కూడా తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు. హీరో విశాల్‌ కూడా పార్టీ పెడతానని ప్రకటించారు.

ఇండియా కూటమికే సర్వేల మొగ్గు
తమిళనాట ఇండియా కూటమి మళ్లీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని, నాలుగైదు స్థానాలూ వస్తాయని మరో సర్వే
అంటోంది.

అవినీతికి మారుపేరు డీఎంకే. దానిపై తొలి కాపీరైట్‌ ఆ పార్టిదే. అదో ఫ్యామిలీ కంపెనీ. రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది. భాష, కులం, మతం, విశ్వాసం అంటూ విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే వంటి కుటుంబ పార్టిలు అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నాయి. కచ్చతీవు దీవిని 1974లో శ్రీలంకకు ధారాదత్తం చేసింది ఈ రెండు పార్టిలే.
– వెల్లూరు సభలో ప్రధాని మోదీ

ఎన్డీఏ ఈసారి అధికారంలోకి వస్తే దేశ రాజధానిని నాగపూర్‌కు మార్చేస్తుంది. త్రివర్ణ పతాకాన్ని కూడా కాషాయ జెండాగా మర్చాలని చూస్తున్నారు. గుజరాత్‌ మోడల్‌ కంటే ద్రవిడ మోడల్‌ చాలా గొప్పది. మేం దాన్నే అనుసరిస్తాం.
– డీఎంకే తరఫున ప్రచారంలో కమల్‌ హాసన్‌

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement