కరోనా: వారాంతంలో ఢిల్లీ రికార్డ్‌

Delhi Record For The Weekend - Sakshi

గత ఆరు రోజులతో పోలిస్తే తగ్గిన కరోనా కేసులు

ఆదివారం చేసిన టెస్ట్‌లు 39,115 మాత్రమే

రాజధానిలో 7 వేలు దాటిన కరోనా మరణాలు 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గాయి. గత ఆరు రోజులతో పోలిస్తే ఆదివారం ఢిల్లీలో కరోనా కేసులు కొంతమేర తగ్గాయి. అంతకుముందు రోజుకు 6500 కేసులు సమోదవ్వగా, ఆదివారం మాత్రం 5023 నమోదయ్యాయి. అయితే ఈ తగ్గుదలకు కారణం టెస్ట్‌ల సంఖ్య తగ్గడమే. ఈ వారంలో ప్రతిరోజు సగటున 56,298 టెస్టులు నిర్వహించగా, ఆదివారం మాత్రం 39,115 టెస్ట్‌లు జరిగాయి. పరీక్షల సంఖ్య తగ్గినప్పటికీ పాజిటివ్‌ కేసులు 12 శాతం పైగా ఉన్నాయి. వారాంతంలో పరీక్షల సంఖ్య పడిపోయిన సోమవారం అత్యధిక కేసులు నమోదయ్యాయి. సోమవారం హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం కరోనాతో ఒక్కరోజే 71 మంది చనిపోగా, ఇప్పటివరకు ఢిల్లీలో ఈ మహమ్మారి ధాటికి 7000 మంది పైగా చనిపోయారు. రాజధాని నగరంలో మార్చి 3న మొదటి కేసు నమోదవగా, అదే నెల 13న తొలి మరణం సంభవించింది. కరోనా సోకుతున్న వారితో పోలిస్తే కరోనాతో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గత రెండు వారాల్లో రోజుకు 39 నుంచి 42  గా ఉన్న మరణాల సంఖ్య ఈ వారంలో 65గా ఉంది. గత మూడు వారాలలో సగటు మరణాల రేటు 1.81 శాతం  నుంచి 1.59 శాతానికి తగ్గింది.

‘మేము పరీక్షలు ఎక్కువగా చేయడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ, మరణాల రేటు తగ్గుదల(1.59శాతం)ను పరిశీలిస్తే జాతీయ సగటుకు సమానంగా ఉంది. అంతకు ముందు దేశంలో మరణాల సగటు కన్నా ఒక శాతం ఎక్కువగా ఉన్న గత పది రోజుల్లో మరణాల రేటు 0.95శాతం తగ్గింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక శాతం మరణాల కన్నా తక్కువ ఉండటం మంచి పరిణామమేనని తెలిపింది’ అని ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు. గుర్తించిన మార్కెట్‌ ప్రాంతాలు, జనాలు సంచరించే ప్రదేశాల్లో, అంతర్రాష్ట్ర బస్‌ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో కనీసం 20 నుంచి 30 శాతం వరకు పరీక్షలు చేసినట్లు తెలిపారు. 

కేసుల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గుతున్నప్పటికీ, పరీక్షించిన వాటిలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. రాజధాని ప్రాంతంలో మహమ్మారి వ్యాప్తి రేటు ఎక్కువగా ఉంది. ఈ వారంలో సగటు వ్యాప్తి రేటు 12.6 శాతంగా ఉండగా, గత వారాల్లో అది 7.18 శాతం, 10.3 శాతంగా ఉంది. ఈ తేడా కరోనా వ్యాప్తి పెరుగుదలను చూపిస్తుంది. ‘ఈ పెరుగుదల ఢిల్లీలో కరోనా వ్యాప్తిని సూచిస్తుంది. అధిక జనాభా ఉన్న ఈ నగరంలో రాబోయే రోజుల్లో మరిన్ని కోవిడ్‌ కేసులు పెరిగేలా ఉన్నాయి. కేసులు  అధికంగా  ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్‌ కాంటాక్ట్‌ సన్నిహితులకు పరీక్షలు చేయించడానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కేసుల సంఖ్య తగ్గించడానికి, ప్రజలు ఎక్కువగా బయట కలవకుండా నియత్రించాలి. ఆర్థిక పరమైన కారణాలతో మరోసారి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించకపోవచ్చు. కానీ పెళ్లి వేడుకల్లో, ఫంక‌్షన్లకు తక్కువ మందినే అనుమతి ఇవ్వాలి. అదే విధంగా బార్లు, రెస్టారెంట్లలో సమయాన్ని తగ్గించాల’ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ మహమ్మారి, అంటువ్యాధుల మాజీ ఉన్నతాధికారి డాక్టర్‌ లలిత్‌ కాంత్‌ అన్నారు.     ( పాజిటివ్‌... కానీ లక్షణాలు లేవు )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top