Delhi liquor scam: త్వరలో వస్తా..అరవింద్‌ కేజ్రీవాల్‌ | Sakshi
Sakshi News home page

Delhi liquor scam: త్వరలో వస్తా..అరవింద్‌ కేజ్రీవాల్‌

Published Sun, Mar 24 2024 5:35 AM

Delhi liquor scam: Sunita Kejriwal and Delhi CM video message from ED custody - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్‌ విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌చేసిన నేపథ్యంలో ఈడీ కస్టడీ నుంచి ఆయన వీడియో సందేశం ఇచ్చారు. దాన్ని ఆయన భార్య సునీత ప్రత్యక్షప్రసారంలో చదివి వినిపించారు. ‘‘జైల్లో ఉన్నా, బయటున్నా నా జీవితంలో ప్రతి క్షణం దేశ సేవకే అంకితం. నా ప్రతి రక్తపుబొట్టు దేశం కోసమే ధారపోస్తా.

మీ సోదరుడు, కుమారుడినైన నన్ను ఏ జైలూ ఎక్కువ రోజులు బంధించలేదు. త్వరలోనే బయటికొస్తా. మీకిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తా. కష్టాల్లోనే పెరిగా. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డా. అందుకే ఈ అరెస్ట్‌తో ఆశ్చర్యపోలేదు. దేశాన్ని బలహీన పరిచే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వాటిని ఓడించండి’’ అని బీజేపీని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘గత జన్మలో ఎంతో పుణ్యంచేసుకొని ఉంటా. అందుకే ఈ పుణ్యభూమిలో పుట్టా. కోట్లాదిగా మీరు చూపిస్తున్న ఈ ప్రేమే నాకు కొండంత అండ’ అని అందులో కేజ్రీవాల్‌ అన్నారు.

బీజేపీ వాళ్లంతా నా సోదరసోదరీమణులు
‘‘ఆప్‌ వాలంటీర్లకు నాదో సూచన. నేను కస్టడీలో ఉన్నా çసామాజిక, సేవ కార్యక్రమాలు ఆగకూడదు. ఢిల్లీ మహిళలకు నెలకు రూ.1,000 వాగ్దానం నేనొచ్చాక నెరవేరుస్తా. నన్ను అరెస్ట్‌ చేశారని బీజేపీపై ద్వేషం పెంచుకోకండి. వాళ్లంతా నా సోదరసోదరీమణులు. ప్రజల ఆశీర్వా దాలతో మూడుసార్లు సీఎం అయిన నన్ను అధికార అహంకారంతో మోదీ జైళ్లో పడేశారు. ఇది ఢిల్లీ ప్రజలను వంచించడమే. ఎక్కడున్నా ప్రజాసేవలకే అంకితమవుతా. వాళ్లే నిర్ణాయక శక్తులు. జై హింద్‌’’ అన్నారు.

ఆప్‌ ఢిల్లీ ఆఫీస్‌కు తాళం
ఆప్‌ ఢిల్లీ కార్యాలయానికి సీలు వేశారని మంత్రి ఆతిషి ఆరోపించారు. ‘‘లోక్‌సభ ఎన్నికల వేళ జాతీయ పార్టీ ఆఫీస్‌కు వెళ్లకుండా మా నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం’’ అని చెప్పారు. ఈ వార్తలను పోలీసులు ఖండించారు. ‘‘ఆఫీస్‌కు సీల్‌ వేయలేదు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ నేపథ్యంలో పార్టీ ఆఫీస్‌ ఉన్న ప్రాంతంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. అందుకే వందల సంఖ్యలో వస్తున్న ఆప్‌ కార్యకర్తలను ఆఫీస్‌ వైపు వెళ్లనివ్వట్లేదు. గుమిగూడనివ్వట్లేదు’’ అని వివరించారు. ఆప్‌ ఎమ్మెల్యే గులాబ్‌ సింగ్‌ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారని ఆతిశీ ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

జైలులో సీఎం ఆఫీస్‌కు అనుమతి కోరతాం: భగవంత్‌ మాన్‌
ఈడీ కేసులో కోర్టు కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే అక్కడి నుంచి ఆయన ప్రభుత్వాన్ని నడిపేలా సీఎం తాత్కాలిక ఆఫీస్‌ను ఏర్పాటుచేసేందుకు అనుమతి కోరతామని ఆప్‌ నేత, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ చెప్పారు. ‘ఆప్‌లో కేజ్రీవాల్‌ స్థానాన్ని ఎవరూ భర్తీచేయ లేరు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకూడదనే నిబంధన ఏదీ లేదు. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా కోర్టు కేజ్రీవాల్‌ను జైలుకు తరలిస్తే అక్కడి నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వహి స్తారు. దోషిగా తేలనంత వరకూ చట్ట ప్రకారం ఆయన జైలు నుంచి కూడా పనిచేయవచ్చు. అందుకే ఆఫీస్‌ కోసం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల అనుమతి కోరతాం’ అని మాన్‌ అన్నారు.  

సోదరా, తీహార్‌కు వెల్‌కం!
కేజ్రీవాల్‌కు సుఖేశ్‌ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ప్రియ సోదరా, కేజ్రీవాల్‌! నెమ్మదిగా అయినా నిజమే గెలుస్తుంది. సరికొత్త భారత్‌ శక్తికి ఇదో క్లాసిక్‌ ఉదాహరణ. వెల్‌ కం టూ తీహార్‌ క్లబ్‌. బాస్‌ ఆఫ్‌ తీహార్‌ క్లబ్‌గా ఆహ్వానిస్తున్నా. మీ డ్రామాలకు ముగింపు పడింది’’ అంటూ మనీ లాండరింగ్‌ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్‌ చంద్రశేఖర్‌ శనివారం ఆయకు లేఖ రాశాడు. ‘‘మీ అవినీతంతా బయటపడుతుంది. ఢిల్లీ సీఎంగా 10 కుంభకోణాలు చేశారు. నాలుగింటికి నేనే ప్రత్యక్ష సాక్షిని. లిక్కర్‌ స్కాం కేవలం ఆరంభమే. అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయట పెడతా. నేను ఛైర్మన్‌గా, కేజ్రీ బిగ్‌బాస్‌గా, సిసోడియా సీఈఓగా, సత్యేంద్ర జైన్‌ సీఓఓగా తిహార్‌ క్లబ్‌ నడుపుతా‘’ అన్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement