నాటి చేదు అనుభవాలే గుణపాఠాలు 

Coronavirus India: One Year on, LNJP Corona Warriors Recall Raging Pandemic, Challenges - Sakshi

కోవిడ్‌ మహమ్మారి దేశరాజధానిని తాకి సరిగ్గా ఏడాది

వేలాది మందికి కోవిడ్‌ చికిత్సను అందించిన ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి

ఆనాడు పూలవర్షం కురిపించిన ఢిల్లీ ప్రభుత్వం  

న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం దేశరాజధాని ఢిల్లీలో ప్రముఖ ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో వైద్యసిబ్బంది కోవిడ్‌ మహమ్మారిపై అవిశ్రాంత పోరాటాన్ని ప్రకటించారు. తెల్లటి దుస్తులు, ఆపైన పీపీఈ కిట్లు ధరించి ముఖానికి మాస్కులతో కనిపించిన   వైద్యులు, కోవిడ్‌ రోగులకు చికిత్స అందించే బృహత్కార్యంలో భాగంగా దాదాపు 18 గంటలపాటు ఊపిరిసలపని పీపీఈ కిట్లలోనే గడిపారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచాన్ని గడగడలాడించిన కంటికి కనిపించని క్రిమి ఢిల్లీని తాకి ఏడాది పూర్తయ్యింది. ఆ సమయంలో కోవిడ్‌తో మృతిచెందిన వారి శవాలతో మార్చురీలు నిండిపోయాయి. ఆసుపత్రుల్లో తెల్లటి దుస్తుల్లో ఆసుపత్రుల్లో వైద్యులు, వీధుల్లో ఖాకీ దుస్తుల్లో పోలీసులు.

సర్వత్రా అప్రకటిత భయానక యుద్ధ వాతావరణం రాజ్యమేలింది. కరోనా దేశ రాజధానిని తాకి ఏడాది అయినతరువాత ఇప్పుడిప్పుడే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. శవాల కుప్పలుగా మారిన ఆసుపత్రుల్లోని మార్చురీలు గుర్తొస్తే ఆనాటి భయానక పరిస్థితులు ఎవ్వరికైనా పీడకలలాంటివే. ఆ రోజు ఆసుపత్రిలో బెడ్లకోసం, వైద్య సాయం కోసం ప్రజలు ఒకవైపు, వైద్యసేవల్లో తలమునకలైన వైద్యులు, నర్సులు మరో వైపు ఎల్‌ఎన్‌జీపీ ఆసుపత్రి ఎంతో హడావిడిగా ఉంది. అదే ఆసుపత్రి కారిడార్లో ఇప్పుడు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను గురించిన చర్చలు వినిపిస్తున్నాయి. 

మార్చి 1న ఢిల్లీలో కోవిడ్‌ కలకలం.. 
చైనాలోని వూహాన్‌ నగరంలో కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన అనంతరం కొద్ది నెలలకు, మార్చి 1, ఢిల్లీలో కోవిడ్‌ –19 తొలికేసు నమోదైంది. తూర్పు ఢిల్లీకి చెందిన వ్యాపారి రోహిత్‌ దత్తా గత ఏడాది ఇటలీ నుంచి తిరిగి వచ్చాక ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. 1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్‌ ఫ్లూ తరువాత ఇంత పెద్ద అంటువ్యాధి భారత్‌తో సహా మరెక్కడా కనిపించలేదు.  దేశంలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్‌ ప్రబలడంతో దాన్ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా మార్చినెలాఖర్లో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది.  

కుటుంబాలకు దూరంగా వైద్యసిబ్బంది 
కోవిడ్‌ మహమ్మారి ప్రపంచ ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. లక్షలాది మంది ప్రజలు నెలల తరబడి ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇంటి నుంచే పనిచేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఆరోగ్య కార్యకర్తలపై కోవిడ్‌ చాలా ప్రభావం చూపించింది. వారాంతపు సెలవులు కూడా లేకుండా వైద్య సిబ్బంది కోవిడ్‌ కట్టడిలో రేయింబవళ్ళు అవిశ్రాంతంగా పనిచేశారు. అంతేకాదు తమ విధినిర్వహణలో భాగంగా రోజులు, వారాలు, నెలల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.  

తొలి ఆసుపత్రి
ప్రస్తుతం పాక్షికంగా కోవిడ్‌–19 చికిత్సను అందిస్తోన్న ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రే, ఢిల్లీలో పూర్తిస్థాయి కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చిన తొలి ఆసుపత్రి. అనంతరం రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిట్‌(ఆర్‌జిఎస్‌ఎస్‌హెచ్‌), జీటీవీ హాస్పిటల్, ఆ తరువాత ఇతర ప్రభుత్వ ఆసుపత్రులను సైతం కోవిడ్‌ సెంటర్లుగా మార్చేశారు. కోవిడ్‌ పేషెంటల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం కోవిడ్‌ కి కొన్ని బెడ్స్‌ కేటాయించారు.   

ప్రభుత్వం సంసిద్ధత
అత్యధికంగా రికార్డు స్థాయిలో 11,000 మందికి కోవిడ్‌ చికిత్సనందించిన ఈ ఆసుపత్రిలో ‘‘తొలి దశ కరోనా ఢిల్లీని చుట్టుముట్టిన జూన్‌లో అత్యధిక మంది కోవిడ్‌ రోగులు మృత్యువాత పడ్డారు. కెపాసిటీకి మించి మార్చురీల్లోకి శవాలు వచ్చి చేరేవి. తీవ్రమైన ఎండలు మండే కాలంలో, 40 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో, కోవిడ్‌ చికిత్స చేస్తోన్న వైద్యులు దాదాపు 18 గంటల పాటు పీపీఈ కిట్లు ధరించి ఉండాల్సి వచ్చింది’’ అన్నారు. 

నెలల్లో రోజుకి 4000 కేసులు 
ఢిల్లోలో సెప్టెంబర్, నవంబర్‌లలో రెండు, మూడు దశల్లో కోవిడ్‌ మహమ్మారి విజృంభించింది. అప్పుడు రెట్టింపు స్థాయిలో రోజుకి 4000 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడాదిలో అత్యంత గడ్డు పరిస్థితి అది. అయితే క్రమేణా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. నవంబర్‌ 11న ఒకే రోజులో అత్యధికంగా 8,593 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి.  ఒకే రోజు నవంబర్‌ 19న అత్యధికంగా 131 కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి.  నాలుగు రోజులుగా డైలీ కోవిడ్‌ కేసుల సంఖ్య 200, అంతకన్నా తక్కువగా నమోదౌతున్నాయి. ఫిబ్రవరి 16న ఢిల్లీలో తాజాగా 94 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గత 9 నెలల్లో ఇదే అతి స్వల్పం.


డాక్టర్‌ అమిత్‌ ఆనంద్..‌ ఎల్‌ఎన్‌జేపి ఆసుపత్రిలో వైద్యవృత్తిలో ఉన్నారు. 2000 బెడ్స్‌ ఉన్న ఈ ఆసుపత్రిలో పనిచేసే అమిత్‌ ఆనంద్‌ కోవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటి ముఖం చూడలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం. ‘‘ఢిల్లీలో కోవిడ్‌ మహమ్మారి మొదలై ఏడాది అయ్యింది. నేను నా కుటుంబాన్ని సైతం సరిగ్గా ఏడాది తరువాత కలిశాను’’ అని తెలిపారు 35 ఏళ్ళ డాక్టర్‌ అమిత్‌. 

నా కొడుకు నన్ను గుర్తు పట్టలేదు
‘‘నేను భార్యను, నా రెండున్నరేళ్ళ కొడుకుని బొకారోలో ఈ ఫిబ్రవరిలో కలిశాను. ఇంత సుదీర్ఘకాలం తరువాత కలవడంతో నా కొడుకు నన్నసలు గుర్తుపట్టలేదు. కోవిడ్‌ మహ మ్మారి నిజంగా మమ్మల్ని మా కుటుంబాల నుంచి విడదీసింది. మేం మా విధులు నిర్వర్తించాల్సిందే. మేం ఎంచుకున్న వృత్తి అలాంటిది. అదే మమ్మల్ని అటువైపు నడిపించింది’’ అంటా రు బెగూసరైకి చెందిన ఓ వైద్యుడు. ఈయన భార్య కూడా ఎంబీబీఎస్‌ పట్టా పొందారు.  


సదుపాయాల మెరుగు 

‘‘భవిష్యత్తులో ముందు ముందు రాబోయే సవాళ్ళను ఎదుర్కొనేందుకు కోవిడ్‌ సంక్షోభం ఎన్నో గుణపాఠాలు నేర్పింది’’ అని కోవిడ్‌ని జయించిన, ఎల్‌ఎన్‌జేపి ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ సురేష్‌ కుమార్‌ అన్నారు. ‘‘ఈ సమయంలోనే  వైద్య సదుపాయాలను మరింత మెరుగుపర్చుకున్నాం. తొలుత ఆక్సిజన్‌ సిలిండర్లు కాకుండా మొత్తం 155 బెడ్లకు మాత్రమే పైప్‌ లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ సరఫరా ఉండేది. ఆ తరువాత క్రమంగా దాన్ని 1000 పడకలకు విస్తరించగిలిగాం. ఆ తరువాత దాన్ని 2000 పడకలకు అందించాం. కనీసం ఇప్పుడైతే వైరస్‌ గురించి మనకు కొంత తెలుసు.’’ అని సురేష్‌ కుమార్‌ చెప్పారు. కోవిడ్‌ ప్రారంభమైన ఏడాది తరువా త రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరణాలు బాగా తగ్గాయి. ఢిల్లీలో శనివారం 243 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

చదవండి:
వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ఇలా చేసుకోండి

కరోనా టీకా : ఆశ‍్చర్యపోయిన మోదీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top