‘పక్షపాతం’పై విచారణ జరపాలి

Congress Party Writes Letter To Facebook CEO Mark Zuckerberg - Sakshi

ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్‌ లేఖ

భారత్‌లోని అధికారుల తీరుపై దర్యాప్తునకు డిమాండ్‌

ఉనికి కోసమే ఆరోపణలంటూ బీజేపీ ఎదురుదాడి

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ, సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ లింకులపై వరుస ఆరోపణలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. భారత్‌లోని ఫేస్‌బుక్‌ ఉన్నతాధికారుల కార్యకలాపాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరుతూ సంస్థ సీఈవోకు లేఖ రాసింది. భారత ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఫేస్‌బుక్‌ జోక్యం చేసుకుంటోందని ఆ లేఖలో ఆరోపించింది. అయితే, రాజకీయంగా క్షీణదశలో ఉన్న వారు ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమ వేదికలపై తరచుగా కనిపించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారని బీజేపీ ఆరోపించింది. బీజేపీకి చెందిన కొందరు నేతల విద్వేష ప్రసంగాలపై ఫేస్‌బుక్‌ ఉదాసీనంగా వ్యవహరిస్తోం దంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో వచ్చిన కథనంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు రాసిన ఆ లేఖలో.. ‘భారత్‌లోని ఫేస్‌బుక్‌ కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు కొత్త బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాతే ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపి, ఆ నివేదికను బహిర్గతం చేయాలి. లేకుంటే ప్రస్తుత అధికారులు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది’అని తెలిపారు. ఒకటీ రెండు నెలల్లో ఈ విచారణ పూర్తయ్యేలా ఫేస్‌బుక్‌ కేంద్ర కార్యాలయం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. ‘ఎంతో కష్టపడి సంపాదించుకున్న మన ప్రజాస్వామ్యాన్ని దురుద్దేశపూర్వక, తప్పుడు వార్తలు, విద్వేష ప్రసంగాలతో తప్పుదోవ పట్టించడాన్ని సహించరాదు. ఫేస్‌బుక్‌ తీరును ప్రతి భారతీయుడూ ప్రశ్నించాలి.

స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌ నేతల త్యాగాల ఫలితంగా లభించిన హక్కులు, విలువలకు భగ్నం కలిగించేందుకు ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించి ఉండవచ్చు. 2014 నుంచి ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌లో వచ్చిన విద్వేష ప్రసంగాలకు సంబంధించిన అన్ని ఆధారాలను బయటపెట్టాలి’ అని కోరారు. ‘బీజేపీకి చెందిన కనీసం ముగ్గురు నేతల విద్వేష ప్రసంగాలపై ఫేస్‌బుక్‌ చూసీచూడనట్లు వ్యవహరించిందని వాల్‌స్ట్రీట్‌ కథనం చెబుతోంది. ముఖ్యంగా ఆ సంస్థ ఉన్నతాధికారిణి అంఖిదాస్‌ ఎన్నికల సంబంధిత అంశాల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు. గతంలోనూ కాంగ్రెస్‌ పార్టీ.. ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఉన్నతాధికారుల పక్షపాత ధోరణిని వెలుగులోకి తెచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఫేస్‌బుక్‌ జోక్యం చాలా తీవ్రమైన విషయం’అని వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

వందలాదిగా మా పోస్టులను ఫేస్‌బుక్‌ తొలగించింది: బీజేపీ
రాజకీయంగా ఉనికి కోల్పోయిన వ్యక్తులు ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమ వేదికలపై కనిపించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారని బీజేపీ ఆరోపించింది. తమ అభిప్రాయాలను పంచుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. తన ఇష్టానుసారంగా నడుచుకోని ఏ సంస్థ అయినా బీజేపీ, ఆరెస్సెస్‌ ఒత్తిడితోనే పనిచేస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నమ్ముతుంటారని ఆయన ఎద్దేవా చేశారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో వచ్చిన కథనంపై ఎలా స్పందించాలనేది ఫేస్‌బుక్‌ చూసుకుంటుందన్నారు.

తమ పార్టీకి చెందిన వందలాది  పోస్టులను కూడా ఫేస్‌బుక్‌ తొలగించిందన్నారు. బీజేపీ నేతలవి విద్వేష పూరిత ప్రసంగాలంటూ రాహుల్‌ చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ..  నిరుద్యోగ సమస్యను 6 నెలల్లోగా పరిష్కరించకుంటే ప్రధాని మోదీని కర్రలతో కొట్టాలంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సభలో రాహుల్‌ గాంధీ యువతను రెచ్చగొట్టారని గుర్తు చేశారు. చర్యలు తీసుకోవాలి ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనప్పటికీ చర్యలు తీసుకోవాలని శివసేన పార్టీ డిమాండ్‌ చేసింది.   

ఫేస్‌బుక్‌ అధికారి, మరో ఇద్దరిపై కేసులు
సామాజిక మాధ్యమాల్లో మత విశ్వాసాలను కించపరిచారంటూ ఫేస్‌బుక్‌ ఉన్నతాధికారి అంఖిదాస్‌తోపాటు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లకు చెందిన ఇద్దరు యూజర్లపై ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కేసులు పెట్టారు. ఓ న్యూస్‌చానల్‌ జర్నలిస్ట్‌ అవేశ్‌ తివారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయ్‌పూర్‌లోని కబీర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో 295(ఎ), 505(1)(సి), 506, 500, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్‌ఎస్‌పీ అజయ్‌ యాదవ్‌ తెలిపారు. ఫేస్‌బుక్‌ దక్షిణ, మధ్య ఆసియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ అంఖిదాస్‌.. తనను ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారంటూ ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో అవేశ్‌ తివారీ పేరు కూడా ఉంది.

నా అకౌంట్‌ 2018లోనే హ్యాక్‌ అయింది: ఎమ్మెల్యే రాజాసింగ్‌
వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో తనపై వచ్చిన ఆరోపణలపై తెలంగాణకు చెందిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో దేశ శ్రేయస్సు కోరే పోస్టులనే తప్ప ఎలాంటి మత విద్వేష వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన అధికార ఫేస్‌బుక్‌ పేజీ 2018లోనే హ్యాక్, బ్లాక్‌ అయిందని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని సోమవారం విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. దేశంలో తన పేరుతో సోషల్‌ మీడియా అకౌంట్లు చాలా ఉండి ఉంటాయనీ, వీటిలో వచ్చే పోస్టులకు బాధ్యత తనది కాదన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top