ఇప్పటి వరకు 13 కోట్లు.. 4 నెలల్లో 40కోట్ల మందికి

Center Expects To Complete Vaccination For 40 Crore People In Next 4 Months - Sakshi

 మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

ఆగస్టు 15 కల్లా 18 ఏళ్ళ పైబడిన వారికి పూర్తిచేయాలని లక్ష్యం

రాష్ట్రాల సమన్వయంతో ముందుకెళ్ళాలన్న యోచనలో కేంద్రం

సాక్షి , న్యూఢిల్లీ: కరోనా విలయతాండవానికి ముకుతాడు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి రికార్డు స్థాయిలో దూసుకెళ్తుండడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో కరోనా సునామీని నియంత్రించేందుకు ఈనెల 30వ తేదీన కేంద్రం కీలక నిర్ణయాలను ప్రకటించేందుకు రెడీ అయ్యిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈనెల 29వ తేదీతో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. దీంతో కరోనాను కట్టడి చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు నష్టం జరగకుండా చూసేలా నిర్ణయాలను అమలు చేసే అవకాశం ఉంది.  

టార్గెట్‌ ఆగస్ట్‌ 15.. 
గతేడాది లాక్‌డౌన్‌ నేర్పిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కరోనా సంక్రమణను ఆపేందుకు కొత్త మోడల్‌ను అభివృద్ధి చేయనున్నారు. అందులోభాగంగా రాబోయే నాలుగు నెలల్లో సుమారు 40 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి వారందరినీ కరోనా రక్షణ కవచంలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అందుకే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు అడ్డంకిలా మారే నిర్ణయం తీసుకొనే అవకాశం లేదు. అంతేగాక కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఆగస్టు 15 లోపు వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ కేంద్రాలను ప్రారంభించే బృహత్‌ ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖతో సహా అనేక ఇతర విభాగాలు ఈ ప్రణాళికపై గత కొన్ని నెలలుగా పనిచేస్తున్నాయి. మే1వ తేదీన ప్రారంభమయ్యే ఈ డ్రైవ్‌లో ఆగస్టు 15లోగా 18 ఏళ్ళ పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు వేసేందుకు అన్ని రాష్ట్రాలతో కేంద్రప్రభుత్వం సమన్వయం చేసుకుంటోంది. 

చదవండి: భారత్‌కు మరో సవాల్‌: కరోనా మూడో అవతారం 

రాష్ట్రాలతో సమన్వయం 
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు కంపెనీల వ్యాక్సిన్లతో ఇప్పటివరకు సుమారు 13 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేశారు. అలాగే రాబోయే కొద్ది రోజుల్లో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న అనేక వ్యాక్సిన్లు మన దేశంలో అందుబాటులోకి రానుందున వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చాలా వేగవంతంగా జరుగుతుందని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రాల ఆరోగ్య శాఖలతో సమన్వయం చేస్తూ , క్షేత్రస్థాయిలో పనిచేసే బృందాలకు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన శిక్షణ ఇస్తున్నారు. అంతేగాక ఈ ప్రక్రియలో సహాయం చేయాలనుకునే ఎన్జీఓలు, కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తయారుచేస్తున్న వ్యాక్సిన్‌లను మనదేశానికి దిగుమతి చేసుకొనే ప్రక్రియ ప్రారంభమైంది.

ప్రస్తుతానికి మనదేశంలో భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్, సీరం ఇన్సి›స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకి సుమారు 30 లక్షల వ్యాక్సిన్లు వేస్తున్నారు. మరోవైపు రష్యన్‌ తయారీ స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌కు భారత్‌లో అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇవి కాకుండా, ఫైజర్, జాన్సన్‌ – జాన్సన్‌ యొక్క సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్, మోడెర్నా, సినోఫార్మ్‌ ,సైనోవాక్‌ వంటి వ్యాక్సిన్లు రాబోయే కొద్ది రోజుల్లో మన దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాక్సిన్లు అన్ని అందుబాటులోకి వచ్చిన అనంతరం దేశంలో రోజువారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని అధికారులు భావిస్తున్నారు.  

ఆచితూచి ఆంక్షలు 
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తే ఆర్థికవ్యవస్థతో పాటు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన లక్ష్యాలను రెండింటినీ ప్రమాదంలో పడేసే అవకాశం ఉన్న కారణంగా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై కేంద్రం ప్రత్యేకంగా దష్టిపెట్టింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, నీతిఆయోగ్‌ ఉన్నతాధికారుల టాస్క్‌ఫోర్స్‌కు ఈ ప్రణాళిక అమలుకు బాధ్యతను అప్పగించవచ్చు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top