ప్రభుత్వ కార్యాలయాల్లో పలుచోట్ల లంచావతారులు
అన్ని శాఖల్లోనూ ఇదే తీరు..
4 నెలల్లోనే ఐదుగురు..
● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర అన్ని శాఖల్లోనూ
డబ్బులిస్తేనే పనులు
● ఉమ్మడి జిల్లాలో వరుసగా ఏసీబీ
అధికారులకు పట్టుబడుతున్న వైనం
● ఈ ఏడాదిలో ఇప్పటికే
ఐదుగురు చిక్కారు
ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అవినీతిపై ఏసీబీకి వస్తున్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి తక్షణమే దాడులు చేపడుతున్నాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించండి. టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు.
– సీహెచ్ బాలకృష్ణ, డీఎస్పీ, ఏసీబీ, మహబూబ్‌నగర్
●
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వశాఖల్లో కొంత మంది అధికారులు లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. పలు కీలక శాఖల్లో కొంతమంది అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తరచుగా ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడుతున్నా.. పలువురు అధికారులు తమ లంచగొండితనాన్ని మాత్రం వీడటం లేదు. తాజాగా బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీకి చిక్కడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
చేయి తడిపితేనే పని..
ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా సందర్బాల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలుకొని కీలకమైన భూ రిజిస్ట్రేషన్ల వరకు ప్రతిదానికీ ఎంతో కొంత సమర్పించుకోనిదే పని కావడం లేదు. పలువురు బాధితులు చైతన్యంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే తప్ప సంబంధిత శాఖలో పర్యవేక్షణ, విజిలెన్స్ గాడి తప్పిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మైనింగ్, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండగా, ఈ మధ్యకాలంలో ఇతరశాఖల నుంచి సైతం ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పౌరసరఫరా శాఖలో మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆ శాఖలో ఫిర్యాదులు అధికమయ్యాయి. మున్సిపాలిటీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుని వారి ద్వారా అధికంగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ముందుపెట్టి పైస్థాయి అధికారులు నేరుగా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏసీబీ వలలో చిక్కి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 మంది పట్టుబడ్డారు. ఈ ఏడాదిలో నాలుగు నెలల్లోనే ఇప్పటివరకు ఐదుగురు ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ శాఖల్లో అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల ఎస్‌ఐ హరిప్రసాద్ రెడ్డి మార్చి 20న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ ఇసుక ట్రాక్టర్‌కు మైనింగ్ అధికారులు రూ.60 వేలు ఫైన్ వేశారు. ట్రాక్టర్‌ను స్టేషన్ నుంచి విడిపించేందుకు ఎస్‌ఐ రూ.30 వేలు లంచం డిమాండ్ చేయగా, బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు దాడి చేయగా ఎస్‌ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అవినీతి అధికారి ఏసీబీకి చిక్కడంతో గ్రామస్తులు రోడ్డుపై టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం.
ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఏసీబీ అధికారులకు ఏకంగా ఆర్డీఓ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం కలిగించింది. బర్త్ సర్టిఫికెట్ జారీ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏప్రిల్ 21న నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఐదుగురు వ్యక్తులకు చెందిన బర్త్ సర్టిఫికెట్లు జారీ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ జారీకి సైతం లంచం తీసుకుంటూ ఏకంగా ఆర్డీఓ అధికారే పట్టుబడటం ప్రభుత్వ శాఖల్లో వేళ్లూనుకుని ఉన్న అవినీతి బాగోతాన్ని బయటపెట్టింది.


