బడిబయట పిల్లలు ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

బడిబయట పిల్లలు ఉండొద్దు

May 14 2026 1:07 AM | Updated on May 14 2026 1:07 AM

మ్యాపింగ్‌ ప్రక్రియకు

సహకరించాలి..

గ్రామస్థాయిలో సర్పంచుల పాత్ర కీలకం

వందశాతం సాధిస్తే సన్మానం

కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక

నారాయణపేట: బడిబయట (డ్రాఫ్‌ అవుట్‌) పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరం సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక కోరారు. ప్రజాపాలన.. ప్రగతిప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట, కొడంగల్‌ నియోజకవర్గంలోని సర్పంచులు, కౌన్సిలర్లకు విద్యాశాఖలో అమలవుతున్న కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి యత్నించాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో బడిఈడు పిల్లలందరూ పాఠశాలలోనే ఉండాలని, డ్రాప్‌ అవుట్‌ జీరో చేయాలని, అందుకు సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు తమ గ్రామానికి ఏం అవసరమో ఇప్పటి వరకే తెలిసి ఉంటుందని.. ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏయే పథకాలు అమలవుతున్నాయి, అందులో తమ పాత్ర ఏమిటనేది అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సర్పంచ్‌లలో ఎక్కువ మంది మహిళలు ఉండటం ఓ మహిళగా తనకు ఎంతో ఆనందంగా ఉందని, అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పారు.

వందశాతం సాధిస్తే సన్మానం..

ప్రస్తుతం జిల్లాలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నారు? ఇంకా ఎంత మంది పాఠశాలకు వెళ్లకుండా ఉన్నారనే వివరాల నివేదికను విద్యాశాఖ రూపొందిస్తుందని చెప్పారు. ఏ గ్రామంలో అయితే వందశాతం పిల్లలు బడికి వెళ్తున్నారో గుర్తించి ఆయా గ్రామాల సర్పంచులకు ప్రభుత్వం ద్వారా సన్మానం చేయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అంతేగాకుండా సర్పంచులు తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రతి వారం సందర్శించాలని, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని, అలా చేస్తే వంట ఏజెన్సీ నిర్వాహకులకు భయం ఉంటుందని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తారని చెప్పారు. అంగన్‌వాడీలు, పాఠశాలల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, పుర చైర్‌పర్సన్‌ కొండా శ్వేతా, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, మద్దూరు పుర చైర్‌పర్సన్‌ సరస్వతి, ఆయా మండలాల ఎంఈఓలు, సెక్టోరియల్‌ అధికారులు రాజేందర్‌కుమార్‌, నాగార్జునరెడ్డి, విద్యాసాగర్‌, డీపీఆర్వో రషీద్‌, తపస్‌ నాయకులు షేర్‌ కృష్ణారెడ్డి, నర్సింహ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాదగిరి జనార్దన్‌రెడ్డి, విద్యాశాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో ఓటరు మ్యాపింగ్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక కోరారు. బు ధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ లో ఎస్‌ఐఆర్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002లో ఉన్న ఓటర్లకు, ఇప్పుడున్న ఓటర్లతో లింక్‌ చేయడమే మ్యాపింగ్‌ ప్రక్రియని.. జిల్లాలోని మండలాలతో పోలిస్తే నారాయణపేటలో ప్రక్రియ చాలా వెనుకబడి ఉందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధు లు తమ బీఎల్‌ఏల ద్వారా బీఎల్వోలకు సహ కారం అందిస్తే ప్రక్రియ వేగంగా పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 82 శాతం మ్యాపింగ్‌ పూర్తయిందని.. కనీసం 95 శాతం కావాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌, బీఆర్‌ఎస్‌ నా యకుడు సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ ఖదీర్‌, సి–సెక్షన్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement