నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఎర్ర కంది క్వింటా సరాసరిగా రూ.7,290 ధర పలికింది. వరి హంసరకం గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,500, వరి సోనారకం గరిష్టంగా రూ.2,496, కనిష్టంగా రూ.1,639 ధరలు లభించాయి.
ప్రారంభమైన ఇంటర్
సప్లిమెంటరీ పరీక్షలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్ధులు 574 మందికిగాను 541 మంది పరీక్షకు హాజరుకాగా, 33 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 532 మందికిగాను 503 మంది, ఒకేషనల్ విభాగంలో 42 మందికిగాను 38 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 111 మంది విద్యార్థులకుగాను 101 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 104 మంది విద్యార్ధులకుగాను 96 మంది, ఒకేషనల్ విభాగంలో ఏడుగురికిగాను ఐదుగురు పరీక్షలు రా సినట్లు డీఐఈఓ సుదర్శన్‌రావు వివరించారు. డీఈసీ స్క్వాడ్ బృందం కోస్గి, మక్తల్, నారాయణపేట, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ధన్వాడ, నారాయణపేట, సిట్టింగ్ స్క్వాడ్ బృందం మద్దూర్, ధన్వాడ కేంద్రాలను తనిఖీ చేసింది.
‘బండి భగీరథ కేసులో నిజాలు నిగ్గు తేల్చాలి’
నారాయణపేట ఎడ్యుకేషన్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై నమోదైన కేసులో అధికారులు నిజాల్ని నిగ్గు తేల్చాలని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, మీడియా ఇన్‌చార్జ్ కిరణ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని ఆయనను బద్నాం చేయడానికే కేసు కుట్ర పన్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులు కేసును మసిపూసి మారెడుకాయ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ బహిరంగంగా ప్రకటించడం దయన నిజాయితీకి నిదర్శనమని తెలిపారు. ఇలా చెప్పే ధైర్యం విపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదని, పోలీసులు కేంద్రం పరిఽధిలో లేరని.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయని వివరించారు.
బడి మనదే..
బాధ్యత మనదే : డీఈఓ
మక్తల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులే పునాదిలాంటివారని జిల్లా విద్యాధికారి గోవిందరాజు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచులు, కౌన్సిలర్ల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గుడి ఎంత పవిత్రమైందో.. బడి కూడా అంతే పవిత్రమైందన్నారు. గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడు మాత్రమే కాదని, ఆ ఊరి పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దే సంరక్షకుడని తెలిపారు. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఉపాధ్యాయులు, పాఠశాలకు అన్నివిధాలుగా సహకరిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు నిజామొద్దీన్, ఖాజా అమృద్దీన్, గణేష్‌సింగ్, జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్, మాధవి, రాంరెడ్డి, శివవంకర్, అశోక్, వీరేష్, శేఖర్, శివరాజ్, అమీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిలకడగా ఉల్లి ధరలు
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. కొన్ని వారాలుగా రూ.వెయ్యి దాటని ఉల్లి ధర గత వారం కొంతమేర పెరిగింది. ఉదయం మార్కెట్‌లో స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.వెయ్యి వరకు పలికింది. 50 కిలోల బస్తాను గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. ఉల్లి నాణ్యతగా ఉండడంతో వినియోగదారులు పెద్దఎత్తున ఉల్లిని కొనుగోలు చేశారు.


