
చిన్నారుల్లో పోషకాహార లోపం
మక్తల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు పెట్టి అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తున్నా చిన్నారుల్లో పోషక లోపం, పెరుగుదల మందగించినట్లు జాతీయ ఆరోగ్య సర్వేల్లో తేలింది. దీంతో మక్తల్, మద్దూర్, నారాయణపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి నెలా చిన్నారుల ఎత్తు, బరువును కొలిచి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అంగన్‌వాడీ టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పోషకాహార లోపం ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక కార్డులు ఇవ్వనున్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో నెలకొకసారి సీ్త్ర, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమై చిన్నారుల్లో గ్రోత్ మానిటరింగ్ వివరాలపై చర్చిస్తున్నారు. అతి తక్కువ బరువు ఉన్న చిన్నారులను ఆస్పత్రుల్లో ఉన్న పోషణ సలహ కేంద్రాలకు పంపించి, వారికి అవసరమైన మందులు అందిస్తున్నారు.
704 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 704 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. వాటిలో మేజర్ అంగన్‌వాడీలు 649 కాగా మినీ కేంద్రాలు 55 ఉన్నాయి. వాటిలో 639 మంది టీచర్లు, 599 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 33,214, మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 27,025 మందికి నిత్యం పోషకాహారం అందిస్తున్నారు. దీంతో పాటు ప్రతి నెలా వైద్య సిబ్బంది అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారులకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి మందులు అందిస్తున్నారు.
చిన్నారుల్లో గ్రోత్ మానిటరింగ్ చేయిస్తాం
జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో గ్రోత్ మానిటరింగ్‌లో భాగంగా చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు చేయిస్తున్నాం. ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తాం. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. పోషకలోపం ఉన్న చిన్నారుల వివరాల కార్డును తల్లిదండ్రులకు అందజేస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాహారాన్ని చిన్నారులకు క్రమం తప్పకుండా అందిస్తున్నాం.
– సరోజిని మట్ట, సీడీపీఓ మక్తల్ ప్రాజెక్టు
వెల్లడించిన జాతీయ ఆరోగ్య శాఖ
అంగన్‌వాడీ కేంద్రాల్లో సర్వే
జిల్లావ్యాప్తంగా 3 ఐసీడీఎస్ ప్రాజెక్టులు