
విధుల్లో అలసత్వం ప్రదర్శించొద్దు
దామరగిద్ద: పోలీసులు విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజు ఎస్పీ స్వాగతం పలికారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాల గురించి ఎస్పీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఆదేశించారు. రికార్డులు, పెండింగ్, కోర్టు, దర్యాప్తు కేసులను పరిశీలించారు. నూతన సాంకేతిక వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని, ప్రజలకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించి మోసాలకు గురికాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్‌ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.