కోవెలకుంట్ల: పట్టణంలోని సంతపేటలో ఓ గోదాములో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం రాత్రి దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు రెండేళ్ల నుంచి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. రేషన్‌కార్డుదారుల నుంచి కిలో రూ. 20 ప్రకారం కొనుగోలు చే సి ఆ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. జూన్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి సొంత గోదాములో నిల్వ ఉంచినట్లు సమాచారం అందటంతో ఉమ్మడి కర్నూలు జిల్లా విజిలెన్స్ ఎస్‌ఐ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 300 బస్తాల(150 క్వింటాళ్లు) రేషన్ బియ్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై రెవెన్యూ, పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
నంద్యాల(అర్బన్): ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువు జూన్ 22 వరకు పొడిగించినట్లు ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్సన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి, ఇంటర్మీడియెట్ పా స్ అయిన వారు అర్హులన్నారు. దరఖాస్తులు www.angrau.ac.in వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 9966505285 నంబరును సంప్రదించాలన్నారు.
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: పరమేశ్వరుడికి సోమవారం ప్రీతికరమైన రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్లలో బారులు తీరారు. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు పంపిణీ చేశారు. భక్తుల శివనామ స్మరణతో శ్రీశైల ఆలయం మార్మోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కిక్కిరిసి కనిపించాయి.
విధుల్లో చేరిన
కర్నూలు డీఎఫ్‌ఓ
కర్నూలు కల్చరల్: కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల సోమవారం విధుల్లో చేరారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్స్‌కు మే 11 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు డెహ్రాడూన్ ఐజీఎన్‌ఎఫ్‌ఏలో నిర్వహించిన మిడ్ కెరీర్ ట్రైనింగ్‌లో ఆమె పాల్గొన్నారు. మేనేజ్‌మెంట్ మాడ్యూల్, థెమాటిక్ టూర్, లైన్ మినిస్ట్రీ మాడ్యుల్ , ఫారెస్ట్రీ మాడ్యుల్‌లో నాలుగు వారాల పాటు శిక్షణ పొందారు. ఈ శిక్షణ కాలంలో నంద్యాల డీఎఫ్‌ఓ నాగమునేశ్వరి కర్నూలు ఇన్‌ఛార్జి డీఎఫ్‌ఓ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె నుంచి శ్యామల బాధ్యతలు స్వీకరించారు.
అధ్యాపక నియామకాల దరఖాస్తు గడువు పొడిగింపు
కర్నూలు కల్చరల్: విశ్వ విద్యాలయాల్లో అధ్యాపక నియామకాల దరఖాస్తు గడువు పొడిగించినట్లు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వి.వెంకట బసవరావు, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వ విద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ షావలి ఖాన్ సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ‘ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ 2026’ ప్రక్రియకు సంబంధించిన గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారన్నారు. https://apuniversitiesrecruitment.apcfss.in వెబ్‌సైట్‌లోని కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించటానికి, రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించడానికి ఈనెల 8వ తేదీకి బదులు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. అన్ని అనుబంధ పత్రాలతో దరఖాస్తు హార్డ్ కాపీని రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా ఈనెల 22వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. అర్హులు, అనర్హుల జాబితా 22వ తేదీన ప్రదర్శిస్తామని, 29వ తేదీ వరకు ప్రాథమిక అర్హతపై ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.


