నంద్యాల(న్యూటౌన్): పేద విద్యార్థులకు సైతం ఉత్తమ విద్య అందించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన విద్యా సంస్కరణలు నేడు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మనబడి, నాడు–నేడు పథకాలతో ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక హంగులతో రూపుదిద్దుకోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వాటిలో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఇంగ్లిష్ పదాలు రావాలంటే కేవలం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలోనే సాధ్యమని తల్లిదండ్రులు భావించే వారు. అయితే ప్రభుత్వ బడుల్లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ప్రవేశాలు పెరిగాయి.
ఉత్సాహంగా.. ఉల్లాసంగా!
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యాసంస్కరణలతో విద్యార్థులు ఉత్సాహంగా.. ఉల్లాసంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు. జిల్లాలో 1,344 ప్రభుత్వ పాఠశాలలకు గాను 996 ప్రైమరీ, 193 అప్పర్‌ప్రైమరీ, 198 హైస్కూళ్లు ఉన్నాయి. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రగతిని వివరిస్తున్నారు.జిల్లాలో 14వేల మందిని చిన్నారులను పాఠశాలలో చేర్చే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటి వరకు 8,778 మంది పిల్లలు నమోదు కాగా ఈ సంఖ్యను 10వేల మందికి పెంచేలా క్షేత్రస్థాయిలో విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. జిల్లాలో 1,31,974 అడ్మిషన్ల లక్ష్యానికి గాను 1,17,920 అడ్మిషన్లు పూర్తయ్యాయని, ప్రస్తుతం 89.33 శాతం నమోదు అయి ప్రవేశాలను 90శాతానికి పైగా పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది.
మారిన స్కూళ్ల రూపులేఖలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను మనబడి, నాడు–నేడు పధకంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పూర్తిస్థాయి మౌలిక వసతులతోపాటు ల్యాబ్‌లను ఏర్పాచేయించారు. అంతేగాకుండా ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం తప్పనిసరిగా ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు ఉచిత భోజనంతో పాటు నాణ్యమైన స్కూల్ బ్యాగ్‌లు, పుస్తకాలు వంటి విద్యా సామగ్రిని అందించారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మరెన్నో సంస్కరణలు అమలుచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మారాయి.
బడి పిలుస్తోంది కార్యక్రమానికి స్పందన బాగుంది. జిల్లాలోని ఉపాధ్యాయులు వారి స్కూళ్ల పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రగతి వివరించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఆశక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు 89.33 శాతం ప్రగతిని సాధించాం. స్కూళ్లు ప్రారంభించేనాటికి 90 శాతం లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకముంది.
– జనార్దన్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
సత్ఫలితాలు ఇస్తున్న నాటి
విద్యాసంస్కరణలు
ఇంగ్లిష్ మీడియం ప్రవేశంతో
పెరుగుతున్న ప్రవేశాలు
ఈ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో
8,778 మంది విద్యార్థుల చేరిక


