● వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్
నంద్యాల: 2025 డీఎస్సీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్‌లు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో భారీ స్కామ్ జరిగిందని, నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో డీఆర్‌ఓ రామునాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతయ్య, అమృతరాజ్‌లు మాట్లాడుతూ.. డీఎస్సీ 2025లో కూటమి ప్రభుత్వంలో తమ అనుయాయులకే ఉద్యోగాలు ఇచ్చారని, అర్హులైన వారికి అన్యాయం చేశారన్నారు. ఎన్‌సీఈఆర్‌టీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న నవీన్ అనే ఉద్యోగి కృష్ణాజిల్లా టాపర్‌గా నిలిచినా డీఎస్సీలో ఉద్యోగం రాలేదని దీనికి గల కారణాలను ప్రభుత్వం చెప్పాలన్నారు. డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలలో నిజమైన ప్రతిభకలిగిన వారికి ఉద్యోగాలను కల్పించలేదన్నారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని, డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నంద్యాల అధ్యక్షుడు నాగేశ్వరరావు, కోవెలకుంట్ల అధ్యక్షుడు మధు, ఎస్సీ సెల్ నేతలు ఆర్థర్ సైమన్, శెట్టి ప్రభాకర్, మునయ్య, ఎర్రన్న, మేస చంద్రశేఖర్, చల్లా సత్యం, మాణిక్య రాజు, కారురవి కుమార్, రవికిరణ్, ప్రేమ్ కుమార్, శేఖర్, గిరి, బాబు, దేవనగర్ బాషా తదితరులు పాల్గొన్నారు.


